వరదాపురం సూరి మళ్లీ టీడీపీలోకి?పరిటాల కుటుంబం ఒప్పుకుంటుందా?

ఒకప్పుడు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు అనుచరుడు ఆయన. అనంతపురంలో రవి అండదండలతోనే ఎదిగాడు. రవిని క్రషర్ వ్యాపారంలోకి దించింది కూడా అతనే .కానీ రవి అగ్రహానికి గురి కావడంతో జిల్లా వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది.

పరిటాల రవి చనిపోయిన కొన్నేళ్లకు సూరి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాడు. 2014లో ఎమ్మెల్యే కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయి.. రాజకీయంగా సైలెంట్ అయ్యాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు యాక్టివ్ అయ్యాడు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి గురించే ఇదంతా. మొన్నటిదాకా బెంగళూరులో ఉన్న వరదాపూరం సూరి.. ఇప్పుడు ధర్మవరం రాజకీయాల్లోకి మళ్లీ ఎంటరయ్యాడు.

1990ల్లో అనంతపురంలో పరిటాల రవి హవా నడిచింది. 1994 నుంచి 2004 దాకా రాజకీయాల్లో చక్రం తిప్పాడు ఆయన. అప్పట్లోనే పరిటాల అనుచరుడిగా వరదాపురం సూరి రాజకీయాల్లోకి వచ్చాడు. రవిని వ్యాపారాల్లోకి దించింది సూరినే. ఆయనతో స్టోన్ క్రషర్ ఏర్పాటు చేయించాడు. అయితే తర్వాత కొన్నాళ్లకే వ్యాపారాలను సూరి నుంచి తన హస్తగతం చేసుకున్న పరిటాల రవి.. వరదాపురం సూరిని అనధికారికంగా జిల్లా నుంచి బహిష్కరించారని స్థానిక నేతలు చెబుతారు. దీంతో అనంతపురం రాజకీయాలకు దూరంగా బెంగళూరు వెళ్లిపోయాడు సూరి. అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ గడిపాడు. కొన్నేళ్లపాటు అక్కడే ఉండిపోయాడు. వ్యాపారాలు, కాంట్రాక్టులతో ఆర్థికంగా ఎదిగాడు. పరిటాల రవి హత్య తర్వాత కొన్నేళ్లకు అజ్ఞాతం వీడారు. 2009లో ధర్మవరంలో అడుగుపెట్టాడు. 

Also Read : ఆ మాజీ మంత్రి పదేళ్ల తరువాత రాజకీయ సన్యాసం చేస్తారంట

2009 ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన వరదాపురం సూరిని చంద్రబాబు ప్రోత్సహించాడు. ఒకవైపు పరిటాల సునీత తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. అయితే మహాకూటమి ఏర్పాటు చేసి పోటీకి దిగిన టీడీపీ.. పొత్తులో భాగంగా ధర్మవరం సీటును సీపీఐకి కేటాయించింది. నిజానికి ఇలా మిత్రపక్షాలకు సీటు ఇవ్వడం, అక్కడ తన పార్టీ నేతలను బరిలోకి దింపడం చంద్రబాబుకు అలవాటే. 2009 ఎన్నికల్లోనూ ఇలానే చేశారు. అలా వరదాపురం సూరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు. దాదాపు 42 వేలకు పైగా ఓట్లు సాధించారు. కానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గెలిచాడు. టీడీపీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి నాగిరెడ్డి మూడుస్థానానికి పరిమితమయ్యాడు

2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు వరదాపురం సూరి. తాను ఎమ్మెల్యే కాగానే ‘వరద సైన్యం’ను ఏర్పాటు చేశారని స్థానిక నేతలు చెబుతుంటాడు. వరద సైన్యంలో దాదాపు 500 మందికి పైగా ఉండేవారిని, వాళ్లందరికీ సూరి జీతాలు కూడా ఇచ్చే వారని చెబుతారు. తన రాజకీయ అనుచరులుగా వాళ్లను అట్టిపెట్టుకున్నారని అంటుంటారు. అధికారంలోకి వచ్చాక ఆరు నెలలు వీరవిహారం చేయాలని.. ప్రత్యర్థులను అణిచివేయాలని తన అనుచరులతో వరదాపురం సూరి చెప్పినట్లుగా ఉన్న ఆడియో ఎన్నికల సమయంలో వైరల్ అయింది.

పరిటాల రవితో వరదాపురం సూరికి ఉన్న విభేదాలు.. పరిటాల సునీత, శ్రీరామ్‌తోనూ కొనసాగాయి. చాలా విషయాల్లో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ భావించాడు. కానీ పరిటాల కుటుంబాన్ని రాప్తాడు వరకే పరమితం చేసిన చంద్రబాబు.. ధర్మవరం నుంచి సూరికి అవకాశం ఇచ్చాడు. ఎన్నికలయ్యాక ఆ ఐదేళ్లు పరిటాల సునీత, వరదాపురం సూరికి మధ్య వివాదాలు కొనసాగాయి. వీలు చిక్కినప్పుడల్లా రెండు వర్గాలు మాటల యుద్ధానికి దిగేవి.

వరద సైన్యం, పార్టీ క్యాడర్ తన వెంటే ఉంటారని, తానే గెలుస్తునని 2019 ఎన్నికల్లో భావించారు సూరి. రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయినా.. తాను గెలుస్తాననే ధైర్యం ఆయనకు ఉండేది. కానీ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హవాకు తోడు, నియోజకవర్గంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సేవా కార్యక్రమాలతో ప్రజల్లో వైసీపీకి మద్దతు పెరిగింది. దీంతో సూరి ఓడిపోయాడు. 

Also Read : ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు..?

2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. చాలా మంది టీడీపీ నేతల మాదిరే వరదాపురం సూరి కూడా బీజేపీలోకి చేరాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి పనికీ కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని టీడీపీ కార్యకర్తలే ఆరోపణలు చేశారు. అదీకాక స్వయాన కాంట్రాక్టర్ అయిన సూరి.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన రోడ్డు కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారని, వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సూరి చేపట్టిన చాలా కాంట్రాక్టు పనులు నిర్మాణ దశలోనే ఉండడంతో.. ముందు జాగ్రత్తగా టీడీపీని వీడి బీజేపీ లో చేరారని అప్పట్లోనే కామెంట్లు వినిపించాయి. అనంతపురం జిల్లాలో కొండలను పిండి చేసి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ గతంలో ఆయనపై ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపితే తనకు సమస్య ఎదురవుతుందని భావించి.. బీజేపీలో చేరడం ద్వారా రక్షణ పొందవచ్చని ఆయన భావించాడు. అందుకే కాషాయ పార్టీలో చేరారు. గత రెండేళ్లుగా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ తన బిజినెస్‌లో ఉండిపోయాడు.

ప్రస్తుతం ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలను పరిటాల కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు అప్పగించాడు. 2019 ఎన్నికలకు పరిటాల సునీత దూరంగా ఉన్నారు. ఆమె కొడుకు పరిటాల శ్రీరామ్ పోటీ చేయగా.. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు, ధర్మవరం నుంచి సునీత, శ్రీరామ్ పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు వరదాపురం సూరి పొలిటికల్‌గా యాక్టివ్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : జమ్మలమడుగు టీడీపీ కొత్త ఇంచార్జ్ ఎవరు?

ధర్మవరంలో మంచి పట్టు ఉన్న సూరి.. తాజాగా తన వ్యక్తిగత ఆఫీసును ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి భారీగానే జనం హాజరయ్యారు. బీజేపీలో ఉన్న ఆయన బీజేపీ పేరుతో కాకుండా.. ప్రజలకు అందుబాటులో ఉండేందుకని చెబుతూ వ్యక్తిగతంగా కార్యాలయాన్ని ప్రారంభించడం చర్చనీయాంశమవుతోంది. టీడీపీ క్యాడర్, వ్యక్తిగతంగా ఉన్న పట్టు, భారీగా అనుచరులు వరదాపురం సూరి వెంట ఉండటంలో చంద్రబాబు ఆయన్ను మళ్లీ పార్టీలోకి పిలిచే అవకాశం ఉందని స్థానిక నేతలు అంటున్నారు. రానున్న ఎన్నికల్లో ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా సూరి పోటీకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చర్చ నడుస్తోంది.

Show comments