Idream media
Idream media
దేశంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్.. ప్రస్తుతం ‘‘చేతిలో’’ ఉన్న మూడు రాష్ట్రాల్లో కూడా పార్టీ పరిస్థితిని చక్కదిద్దలేకపోతోంది. మధ్యప్రదేశ్ , కర్నాటక రాష్ట్రాల్లో జరిగిన పరిణామాల నుంచి కాంగ్రెస్ నేతలు ఇప్పటికి కూడా గుణపాఠం నేర్చుకోలేదు. అంతర్గత విభేదాల కారణంగానే మధ్యప్రదేశ్ , కర్నాటకలో చేజేతులా అధికారాన్ని పోగోట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. పంజాబ్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కెప్టెన్ అమరీందర్‌సింగ్ , సిద్దూ వర్గాల మధ్య ఆధిపత్య పోరు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దారితీయవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. పంజాబ్ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఆమ్ ఆద్మీ పార్టీకి చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నాయకత్వ మార్పు పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం నాయకత్వమార్పుకు దారి తీయనుందా అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి.
రాష్ట్రంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడానికి ఇటీవల ముఖ్యమంత్రిని మార్చినట్లు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నా.. అది ఎంత వరకు ఫలిస్తుందనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది. అధిష్ఠానం తప్పించిన అమరీందర్ సింగ్ రోజురోజుకు తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాహుల్, ప్రియాంక లను విమర్శించేందుకు కూడా వెనుకాడడం లేదు. అమరీందర్ స్థానంలో ఎస్సీ వర్గానికి చెందిన చరణ్ జీత్ సింగ్ చన్నీకి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించి రాష్ట్రం తమ చేతుల నుంచి జారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు అమరీందర్ వ్యవహారం పార్టీకి కొరకరాని కొయ్యగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పంజాబ్‌లో అధికారంలో వున్న కాంగ్రెస్‌కు షాక్ తగిలే అవకాశం వుందని ఇప్పటికే సర్వేలో తేలింది. కాంగ్రెస్, బీజేపీ, అకాలీలను కాదని అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించనున్నట్లు ఏబీపీ సీఓటర్ సర్వే పేర్కొంది. పంజాబ్‌లో 31.5 ఓట్ షేర్‌తో ఆప్ 55 సీట్లు సాధిస్తుందని సర్వే తెలిపింది. ఇక రెండో స్థానంలో వున్న కాంగ్రెస్ 37 సీట్లకు పరిమితమవుతుందని ఏబీపీ సీఓటర్ సర్వేలో స్పష్టం చేసింది. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తప్పదనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికితోడు మారిన పరిణామాలు రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. పదవీచ్యుతుడైన కెప్టెన్ అమరిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పంజాబ్ పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి.
Also Read : మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందా ?
కాంగ్రెస్ పార్టీ నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ లకు రాజకీయ అనుభవం ఏమాత్రం లేదని పలు వార్తా సంస్థలకు అమరిందర్ సింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పేర్కొంటున్నారు. రాహుల్, ప్రియాంకలు తన పిల్లల్లాంటివారని చెబుతూనే..అవమానకరంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని చెప్పారు.
ఎమ్మెల్యేల్ని విమానాల్లో గోవాకు తీసుకెళ్లడం తన విధానం కాదన్నారు. అనుభవం లేని రాహుల్, ప్రియాంకలను కొంతమంది సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని విమర్శించారు. పంజాబ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నవజ్యోత్ సింగ్ సిద్దూపై బలమైన అభ్యర్ధిని పోటీకి దించుతానని హెచ్చరించడం ఇప్పుడు పెద్ద దుమారానికి దారి తీస్తోంది. తనను కాదని సిద్ధూను వెనకేసుకొస్తున్న హైకమాండ్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపోమాపో సొంత కుంపటి పెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
పంజాబ్ చీఫ్ సిద్ధూతో పాటు, నూతన ముఖ్యమంత్రిపై కూడా అమరీందర్ సింగ్ వర్గం ఆరోపణలు కురిపిస్తుండడాన్ని బట్టి అమరీందర్ వేరే కాపురం పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగానే కనిపిస్తోంది. సిద్ధూ వంటి ప్రమాదకర వ్యక్తుల్నించి దేశాన్ని కాపాడేందుకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని తేల్చి చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం అనంతరం మరొకరిని ముఖ్యమంత్రి చేయాలని తానే కోరానని..కానీ సోనియా గాంధీ పట్టించుకోలేదన్నారు. భవిష్యత్ రాజకీయాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. మంగళవారంనాడు సీఎం చరణ్‌జిత్ సింగ్ ప్రైవేట్ జెట్‌లో ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వివాదానికి కారణమవుతోంది. ఇందులో పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ, డిప్యూటీ సీఎంలు సుఖ్‌జిందర్ సింగ్, ఓపీ సోని కూడా ప్రయాణించారు. కేబినెట్ కూర్పుపై పార్టీ పెద్దలతో అత్యవసర సమావేశం కోసం వారు చండీగఢ్ నుంచి ఢిల్లీకి ఈ ప్రయాణం చేపట్టారు.
Also Read : మూడుసార్లు ముఖ్యమంత్రి.. పదవిలో ఉన్నది పట్టుమని పది నెలలే!
ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రయాణాలు చేయడం రాచరికపు పోకడలంటూ శిరోమణి అకాలీదల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. కేవలం 250 కిలో మీటర్ల ప్రయాణానికి ప్రైవేటు జెట్ అవసరమా? అంటూ విమర్శించారు. చండీగఢ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించేందుకు సాధారణ వివామానాలు లేవా? కార్లు లేవా? అని ప్రశ్నించారు. సామాన్యుల ప్రభుత్వమని చెప్పుకుంటూ.. జెట్ విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని శిరోమణి అకాలీదల్ నేతలు ఆరోపించారు.
పంజాబ్ కొత్త కేబినెట్ నిజస్వరూపం ఏంటో తెలిసిపోయిందంటూ పంజాబ్ ఆప్ నేత హర్పాల్ సింగ్ చీమా విమర్శించారు. మాటల ద్వారా కాదు..చేతల ద్వారా ఒకరి నైజం బయటపడుతుందని ఘాటు విమర్శలు చేశారు. అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ కూడా ఢిల్లీ ప్రయాణానికి 16 సీట్ల ప్రైవేటు జెట్‌ను వినియోగించడం సరికాదన్నారు. అత్యవసరమనుకుంటే ఐదు సీట్ల ప్రైవేట్ జెట్ లభిస్తుందని చెప్పారు. అమరీందర్ సర్కార్ నాలుగున్నరేళ్లుగా పొదుపు చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.
వచ్చే మార్చి నాటికి ప్రభుత్వం పాలనా కాలం ముగియనుంది. ఎన్నికలు జరిగే గడువు సమీపిస్తున్న కొద్దీ పంజాబ్ కాంగ్రెస్ లో రాజకీయాలు ముదురుతుండడం అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. కొత్త రాష్ట్రాలను చేజిక్కించుకోవడం దేవుడెరుగు.. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలలోనైనా అధికారం కాపాడుకోవడం కాంగ్రెస్ కు భారంగా మారనుంది. ఈ నేపథ్యంలో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
Also Read : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిపై “#Me Too” మచ్చ!