రైతు భరోసా కేంద్రాల్లో అదొక్కటే సమస్య

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ సర్కార్‌ మరో ఆలోచన లేకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పంటకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సేకరించుకునే క్రమంలో గతంలో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ సచివాలయం వద్ద ఈ రైతు భరోసా కేంద్రాలు ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతన్నలకు సేవలు అందిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌ ఒకటిన ఖరీఫ్‌ ప్రారంభమైన రోజునే సీఎం జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 వేల పైచిలుకు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.

యూరియా, డీఏపీ వంటి ఎరువులు, విత్తనాలతోపాటు ఈ పంట నమోదు వంటి సేవలు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రం పేరుతో స్థానికంగా ఉండే వ్యవసాయ సహాయకుడు ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు చేసి అందులో వాలంటీర్లు, రైతులను సభ్యులుగా చేశారు. రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉండే ఎరువులు, విత్తనాలు, ఇతర సేవలను ఎప్పటికప్పుడు ఈ వాట్సప్‌ గ్రూప్‌ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు.

ఎరువుల దుకాణంలో కన్నా రైతు భరోసా కేంద్రాలలో ఆయా ఉత్పత్తుల ధరలు తక్కువగా లభిస్తున్నాయి. అయితే రైతులు బుక్‌ చేసుకున్న తర్వాత ఎరువులు వస్తున్నాయి. ఇక్కడే అన్నదాతలు కొంత ఇబ్బంది పడుతున్నారు. బుక్‌ చేసుకున్న తర్వాత ఎరువులు ఎప్పటికి వస్తాయన్నది ఖచ్చితంగా తెలియడం లేదు. రెండు నుంచి వారం, పది రోజుల సమయం కూడా పడుతోంది.

ప్రతి 20 మండలాలకు ఒక స్టాక్‌ పాయింట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంపెనీ నుంచి ఎరువులు సదరు స్టాక్‌ పాయింట్‌కు రాగానే నాణ్యత పరీక్షించి బుక్‌ చేసుకున్న రైతులకు సరఫరా చేస్తున్నారు. అయితే లోడ్‌ రావాలంటే కనీసం 50 బస్తాల బుకింగ్‌ జరగాల్సి ఉంటుంది. ఒక రైతుగానీ, లేదా పలువురు రైతులుగానీ బుక్‌ చేసుకున్న ఎరువుల మొత్తం 50 బస్తాలు ఎప్పుడు అయితే.. అప్పుడే స్టాక్‌ సదరు రైతు భరోసా కేంద్రానికి పంపుతున్నారు. దీనికి ఎంత సమయం పడుతుందన్నది వ్యవసాయ సహాయకుడు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

ఈ విధానం వల్ల రెండు, మూడు బస్తాల ఎరువులు అవసరమయ్యే చిన్న, సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయంలో ఎరువులు వస్తాయో..? లేదో అన్న అనుమానంతో తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి పట్టణంలోని ఎరువుల వ్యాపారినే చిన్న, సన్నకారు రైతులు ఆశ్రయించాల్సి వస్తోంది. అధిక థర చెల్లించడంతోపాటు రవాణా ఖర్చు వల్ల రైతు నష్టపోతున్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలోనే నిర్ణీత మొత్తంలో ఎరువులు అందుబాటులో ఉంచడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైతన్నలు చెబుతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు రైతు భరోసా కేంద్రాల సేవలు అందేలా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show comments