Idream media
Idream media
చింత చచ్చినా పలుపు చావలేదనే సామెత కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత చింతా మోహన్ వ్యవహారశైలికి అతికినట్లు సరిపోతుంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1984 మధ్య 2009 వరకు ఆరు సార్లు ఎంపీగా గెలిచిన చింతా మోహన్ పలుమార్లు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 70వ పడికి దగ్గరలో ఉన్న చింతా మోహన్‌కు.. ఇంకా అధికారంపై ఆశ మాత్రం చావలేదు. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడడం, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో హస్తం పార్టీ నామరూపాల్లేకుండా పోవడంతో.. చింతా మోహన్ లాంటి వారికి రాజకీయ ప్రాధాన్యం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలో ప్రజా బలం ఉన్న నేతలను ఇతర పార్టీలు చేర్చుకోగా.. చింతా మోహన్ మాత్రం అక్కడే ఉండిపోక తప్పలేదు.
ఆరుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసిన చింతా మోహన్ అధికారంపై ఆశతో ఇప్పటికీ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ స్వియ తప్పిదాల వల్ల ఆ పార్టీ ఏపీలో చతికిలపడిపోగా.. చింతా మోహన్ మాత్రం వైసీపీ వల్ల ఆ పరిస్థితి వచ్చిందంటూ.. వైఎస్ కుటుంబాన్ని ఆడిపోసుకుంటున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా.. వైఎస్ కుటుంబంపై అక్కసును వెళ్లగక్కే చింతా మోహన్ తాజాగా.. మరోసారి అదే దారిలో నడిచారు.
Also Read : బద్వేల్ ఉప ఎన్నిక – కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే
వైఎస్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే.. వైఎస్‌జగన్ సీఎం అయ్యేవాడు కాదంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ఓ థియరీ చెప్పారు చింతా మోహన్. 2004లో వైఎస్‌ను సీఎంను చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్నారు. నాడు వైఎస్ సీఎం కాకుండా ఉంటే.. నేడు వైఎస్ జగన్ సీఎం కాలేకపోయేవాడన్నారు. చింతా మోహన్ చేసిన ఈ వాఖ్యల్లో వాస్తవం ఎంత అనేది.. నాటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరిని అడిగినా చెబుతారు. ముఖ్యంగా చింతా మోహన్ తెలుసుకోవాల్సింది.. కాంగ్రెస్ పార్టీ వైఎస్‌ను ముఖ్యమంత్రిని చేయలేదు.. వైఎస్ తన రెక్కల కష్టంతో ముఖ్యమంత్రి అయ్యారు. మండువేసవిలో పాదయాత్ర చేసి.. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి.. వరుసగా రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌పార్టీకి ప్రాణం పోశారన్న విషయం నేడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కూడా ఒప్పుకుంటారు.
వైసీపీ వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని చింతా మోహన్ నిజాలే చెప్పారు. అయితే వైసీపీ ఆవిర్భావం ఎలా జరిగింది..? అనేది కూడా ఆయన ఓ సారి గుర్తు చేసుకుంటే.. తప్పు ఎవరిది..? అనే విషయం అర్థం అవుతుంది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా.. నేతల పితూరులు, నివేదికల ద్వారా తీసుకున్న రాజకీయ, విధాన నిర్ణయాల ఫలితం కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తోంది. వైఎస్ జగన్ విషయంలోనూ, రాష్ట్ర విభజనలోనూ చేసిన తప్పిదాలు.. ఆ పార్టీని ఏపీలో తుడిచిపెట్టుకుపోయేలా చేశాయని చింతా మోహన్ ఎప్పటికి గ్రహించగలుగుతారు..?
Also Read : మోత్కుపల్లి నిరీక్షణ ఫలించబోతోందా..?