Idream media
Idream media
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలు దాటింది. 47 స్థానాలను గెలుచుకుని భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలిచింది. టీఆర్‌ఎస్ 56 స్థానాలను పొంది మొదటి స్థానంలో నిలిచింది. మేయర్ పీఠం టీఆర్‌ఎస్‌కే అంటూ మొదటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫలితాలు వెల్లడైన తర్వాత నుంచీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు పెడతారంటూ ఆందోళన చేసిన బీజేపీ ఎప్పుడూ మేయర్ పీఠం కోసం పోటీలో ఉంటామని చెప్పలేదు. పైగా ఎక్స్ అఫీషియో సభ్యులతో పోల్చుకుంటే గ్రేటర్ లో బీజేపీది మూడో స్థానం. అయినప్పటికీ ఇంకో మూడు రోజుల్లో మేయర్ ఎన్నిక జరగనుంది అనగా అనూహ్యంగా మేయర్ పోటీలో ఉంటున్నట్లు ప్రకటించింది. అయితే, ఎన్నిక ముందు రోజు రాత్రి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించ లేదు. దీంతో అసలు బీజేపీ వ్యూహం ఏంటి..? ప్రకటించినట్లు పోటీలో ఉంటుందా.. లేదా..? అనే సందేహాలు మొదలయ్యాయి. ఓడిపోతామని తెలిసి కూడా పోటీలో ఎందుకు నిలబడుతున్నట్లు అన్న ప్రశ్న కూడా తలెత్తింది. మేయర్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఇదీ మా వ్యూహం.. ఆ విషయం బయట పెట్టడానికే మేం పోటీలో నిలబడ్డాం అంటూ అసలు విషయం చెప్పింది.
చీకటి ఒప్పందం బయటపెట్టేందుకే..
టీఆర్‌ఎస్, మజ్లిస్ నాటకాన్ని బట్టబయలు చేయడానికి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశామని, ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని ఈ ఎన్నికల్లో స్పష్టమైందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం, టీఆర్‌ఎస్ కొట్లాడుకున్నట్లు కనిపించారని అన్నారు. స్నేహపూర్వకంగానే ఉంటూ ప్రజలను మభ్య పెట్టే రీతిలో నాటకాలు చేస్తున్నారని ఆ రోజే బీజేపీ చెప్పిందన్నారు. వారి అనుబంధాన్ని బట్ట బయలు చేయడానికి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. గెలవడం, ఓడిపోవడం ముఖ్యం కాదని చెప్పారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్, మజ్లిస్ చేసే అక్రమాలను అడ్డుకుంటామని, మంచి కార్యక్రమాలు చేపడతే సహకరిస్తామని వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేస్తే 15 సీట్లు కూడా వచ్చేవి కావని, ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేశాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బలం లేకపోయినా తాము బరిలో నిలవడంతో టీఆర్‌ఎస్, ఎంఐఎం అసలు రంగు బయట పడిందన్నారు.
కౌన్సిల్‌లో నినాదాలు…
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎంఐఎం సభ్యులు చేతులెత్తడంపై బీజేపీ సభ్యులు షేమ్.. షేమ్.. అని నినదించారు. మజ్లిస్ మద్దతుతోనే మేయర్, డిప్యూటీ దక్కించుకున్నారని విమర్శించారు. ఎన్నిక పూర్తయ్యాక ఇరు పార్టీల సభ్యులు పోటాపోటీగా నినాదాలిచ్చారు. జై తెలంగాణ టీఆర్‌ఎస్ సభ్యులంటే… జై శ్రీరామ్… భారత్ మాతాకీ జై అని బీజేపీ సభ్యులు నినదించారు. సభ్యులు నిశ్శబ్ధంగా ఉండాలని ప్రిసైడింగ్ అధికారి పలుమార్లు సూచించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంల చీకటి ఒప్పందం బట్టబయలైందని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఓట్ల కోసం ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు లేదని చెప్పిన టీఆర్‌ఎస్.. ఆ పార్టీ అండతోనే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్నాయని ధ్వజమెత్తారు. మేయర్ ఎన్నిక తర్వాత గురువారం బీజేపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.