అరణ్య మౌనానికి కారణం

త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న రానా కొత్త సినిమా అరణ్య లాక్ డౌన్ వల్ల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తిరిగి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా తెలియదు. తాజా అప్ డేట్ ప్రకారం అరణ్య డిజిటల్ రిలీజ్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే అనుష్క నిశ్శబ్దం, నాని విల గురించి ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి. కానీ అరణ్య విషయంలో మాత్రం ఇది ఎక్కడా హై లైట్ కాలేదు. హిందీలో హాథీ మేరీ సాతి, తమిళ్ లో కాదన్ పేరుతో రూపొందిన అరణ్య ఫస్ట్ కాపీ రెడీగా ఉంది.

ఏప్రిల్ 2 షెడ్యూల్ చేసిన డేట్ అనూహ్యంగా వృధా అయిపోయింది. పోనీ లేట్ అయినా వేచి చూద్దామా అంటే బాలీవుడ్లో క్యూ కట్టిన చిత్రాలు ఇప్పుడు చాంతాడంత ఉన్నాయి. అక్షయ్ కుమార్ సూర్య వంశీతో మొదలుపెడితే లక్స్మీ బాంబ్ దాకా సుమారుగా పదిహేను సినిమాలు వేచి చూస్తున్నాయి. తెలుగు, తమిళ్ లోనూ అంతే. పైగా థియేటర్లకు పూర్వ స్థాయిలో పబ్లిక్ రావడానికి రెండు మూడు నెలలు పడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్న టైంలో ఎవరూ త్వరపడి రిస్క్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ అరణ్య ప్రొడక్షన్ పార్టనర్స్ తో చర్చల్లో ఉందట. ఒకవేళ సానుకూలమైన స్పందన వస్తే జ్యోతిక, అమితాబ్ బచ్చన్, కీర్తి సురేష్ ల తర్వాత మరో స్టార్ హీరో సినిమాను ఓటిటిలో చూసుకోవచ్చు.

ఆడవి నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథలను మనసుకు హత్తుకునేలా తీస్తాడని పేరున్న ప్రభు సాల్మోన్ దర్శకుడు కావడం అరణ్యపై అంచనాలు పెంచుతోంది. ప్రేమఖైది, గజరాజులు బ్లాక్ బస్టర్లు కాకపోయినా తెలుగులోనూ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక్కడ కంటే అరణ్య మీద తమిళనాడులో ఎక్కువ హైప్ ఉంది. ట్రైలర్ వచ్చాక హిందిలోనూ బజ్ వచ్చింది. ఎటొచ్చి తెలుగులోనే కొంచెం తక్కువ అని చెప్పాలి. మరి అరణ్య విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. జరుగుతున్న పరిణామాలు నిర్మాతలు నిశీతంగా పరిశీలిస్తున్నారని, ఇంకో రెండు వారాలు గమనించి ఆపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందట. లాక్ డౌన్ మెల్లగా సద్దుమణుగుతోంది కాని థియేటర్ల సంగతే అంతుచిక్కడం లేదు.

Show comments