టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి చాలా చర్చలు జరిగాయి. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం టి20 వరల్డ్ కప్ తో ముగుస్తున్న నేపథ్యంలో తర్వాత ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చలు జరిగాయి. ప్రస్తుతం టీమిండియాకు కోచ్ గా ద్రావిడ్ బాధ్యతలు చేపడితే వచ్చే ప్రపంచ కప్ లో కచ్చితంగా టీమిండియా కప్పు గెలిచే అవకాశం ఉందని అంచనాలను చాలామంది క్రికెట్ అనలిస్టులు వ్యక్తం చేశారు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదు.

అయితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ… ద్రావిడ్ విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించి నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ గా ఉన్నా సరే కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని… ఒత్తిడి చేశాడు అనే వ్యాఖ్యలు వినిపించాయి. వీళ్లిద్దరి మధ్య దీనికి సంబంధించి దాదాపుగా నాలుగు నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మీడియాలో ఎక్కువగా వచ్చాయి. టీమిండియా మూడు నెలల క్రితం శ్రీలంక పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ జట్టుకు కోచ్ గా ద్రావిడ్ వ్యవహరించాడు.

అయితే పూర్తిస్థాయిలో ద్రావిడ్ బాధ్యతలు చేపట్టాలని చాలామంది ఆయనపై ఒత్తిడి తీసుకురావడంతో మరో మార్గం లేక ద్రావిడ్ బాధ్యతలను తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. విదేశాల్లో సుదీర్ఘ అనుభవం ఉండటం వచ్చే రెండేళ్లు టీమిండియా విదేశాల్లో ఎక్కువగా సిరీస్ లు ఆడుతున్న నేపథ్యంలో… కోచ్ గా ద్రావిడ్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. దానికి తోడు సీనియర్లు మరో రెండేళ్ళు మాత్రమే క్రికెట్ ఆడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత జట్టుకి యువ కెప్టెన్ కూడా కావాల్సి ఉంది. త్వరలో న్యూజిలాండ్ పర్యటన తర్వాత కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చూసి అప్పుడు అతనిని కెప్టెన్ గా నియమించే ఆలోచన కూడా ద్రావిడ్ చేయవచ్చని అంటున్నారు. ద్రావిడ్ శిక్షణ లోనే కె.ఎల్.రాహుల్ అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు. కాబట్టి యువ ఆటగాళ్లను ద్రావిడ్ తయారు చేయగలరని టీమిండియాకు మరో రోహిత్ శర్మని కోహ్లీ ని తీసుకురాగలరని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ద్రావిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కచ్చితంగా ప్రస్తుత టీమ్ లో ప్రతిభ ఉండి కూడా సమర్థవంతంగా ఆడలేని ఆటగాళ్లను అలాగే విదేశాల్లో ప్రభావం చూపించలేని ఆటగాళ్లను మార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద్రావిడ్ అండర్ 19 జట్టుకి అదేవిధంగా ఇండియా ఏ జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు. కోచ్ గా ద్రావిడ్ మాత్రమే బిసిసిఐకి అప్లికేషన్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అది కేవలం ఫార్మాలిటీ మాత్రమేనని ద్రావిడ్ ను గంగూలీ ఫైనల్ చేసిన తర్వాత బోర్డు లో ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదని అంటున్నారు. ఇక కోచ్ గా ద్రావిడ్ ఏడాదికి 8 కోట్ల జీతం తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారత జట్టు లో ఆడుతున్న యువ ఆటగాళ్లు అందరూ దాదాపుగా ద్రావిడ్ శిక్షణలో రాటుదేలిన వాళ్లే. కాబట్టి ఇప్పుడు ద్రావిడ్ బాధ్యతలు చేపడితే కచ్చితంగా జట్టు మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది. ఇక టీమిండియా కూడా ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయని ప్రధానంగా బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని కీలక మార్పులు జరగవచ్చు అని అదే విధంగా బౌలింగ్ లో కూడా కొంత మంది ఆటగాళ్లను ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కెప్టెన్ కోహ్లి ద్రావిడ్ మాట ఎంతవరకు వింటాడు అనేది తెలియాల్సి ఉంది. అనిల్ కుంబ్లే భారత జట్టుకు కోచ్ వ్యవహరించిన తర్వాత అప్పుడు డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రి పూర్తిస్థాయి కోచ్ గా రావాలని కోహ్లీ ఒత్తిడి చేయడంతో బీసీసిఐ మరో మార్గం లేక రవిశాస్త్రిని కోచ్ గా నియమించింది. అప్పుడు రవిశాస్త్రి కోచ్ కాకపోయి ఉంటే కచ్చితంగా ద్రావిడ్ బాధ్యతలు చేపట్టి ఉండేవాడు అనే వార్తలు కూడా వచ్చాయి.

Show comments