జిఎస్టీ.. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో 2017 జులై నెలలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అస్తవ్యస్తంగా ఉన్న కేంద్ర రాష్ట్రాలకు చెందిన 17 రకాల పన్నులు జిఎస్టీలో విలీనం అయ్యాయి. కానీ జిఎస్టీలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గండికొడుతున్నారు.. తాజాగా పూల రాంబాబు అనే వ్యక్తి సుమారు 50 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్లు అధికారులు గుర్తించారు.
ఎవరీ పూల రాంబాబు ?
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన పూల రాంబాబు మొదట్లో రోడ్డు పక్కన మిఠాయి బండి నడిపేవాడు. మిఠాయి బండి వ్యాపారంలో పెద్దగా లాభాలు రాకపోవడంతో హైదరాబాద్ బాట పట్టాడు.. డబ్బు సంపాదించాలన్న తపనతో పెట్రోల్ బంకుల్లో పని చేసాడు. అనంతరం పాత ఇనుప సామాన్ల వ్యాపారం మొదలుపెట్టాడు.. దాన్ని కూడా ఆపేసాడు. ఈసారి సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలో కాలు పెట్టాడు.. జిఎస్టీ విధానంలో ఉన్న లొసుగులు తెలుసుకున్నాడు. పైసా పెట్టుబడి లేకుండా ఆరు బోగస్ కంపెనీలను సృష్టించి ఆ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్లు నకిలీ ఇన్‌వాయిస్ లను సృష్టించి సుమారు 48.99 కోట్ల మేర ప్రభుత్వం నుండి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను తీసుకున్నాడు..
ఇన్‌పుట్ టాక్స్ పొందటానికి పూల రాంబాబు ఆరు నకిలీ కంపెనీలైన గోపాల్ ట్రేడ్ ఇంపెక్స్, మారుతి ఎంటర్‌ప్రైజెస్, శ్రీఎంటర్‌ప్రైజెస్, లాస్య ఎంటర్ ప్రైజెస్, అభిజ్ఞ ఎంటర్ ప్రైజెస్, ఎస్వీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలను సృష్టించాడు. వాటిలో ఒకటి అతని భార్య పేరిట, మిగిలిన ఐదు కంపెనీలు అతని దగ్గరి సహాయకుల పేరిట ఉన్నాయని తేలింది. సీజీఎస్టీ అధికారులు రాంబాబును అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. రాంబాబు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అతడి నుంచి ఇప్పటివరకు రూ. 2.31 కోట్లను రికవరీ చేయగా ఆర్థిక నేరాల కోర్టు ఈనెల 16 వరకు పూల రాంబాబుకు రిమాండ్ విధించింది.