మనసు ఉండాలే గానీ..

మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు పెద్దలు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేకానేక సవాళ్ళను ఎదుర్కొనేందుకు పట్టుదలతో వేచి ఉండాలని సూచించేందుకు కూడా దీనిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకునేందుకు మనిషి స్థాయితో సంబంధం లేన్న విషయం తెలిసిందే.

నిన్నమొన్నే మనకు అనుభంలోకొచ్చిన లాక్డౌన్‌ కారణంగా బిడ్డా పాపలతో కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళుతున్నవాళ్ళకు ఎక్కడిక్కడే ఆహారం, మంచినీళ్ళు, రవాణా సదుపాయాలను తమ ‘శక్తి’ని చూసుకోకుండానే పలువురు సహాయపడ్డారు. అలా నడిచి పోతున్నవాళ్ళెవరో సాయం చేసిన వారికి కనీసం ముఖ పరిచయం కూడా లేకుండా ఇదంతా చేసారు. అరె.. సాటి మనుషులే.. కష్టపడుతున్నారు.. అన్న భావనే అటువంటి సాయానికి వారిని పురికొల్పింది. ఇక్కడ సామాజిక, ఆర్ధిక స్థితికి సంబంధం లేకుండా తాను చేసేది చేసి, తనకు తెలిసిన వారితో ఇంకొంత మందికి సాయం చేయించారు.

ఉద్యోగంలో చేరింది మొదలు తమ సంస్థ గురించే అహర్నిశలు కష్టించే ఉద్యోగులను ఆదుకోవడంలో పలు ప్రైవేటు సంస్థలు విఫలమవుతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్‌లు, ట్రావెల్‌ ఏజెన్సీలు, పెద్దపెద్ద షాపింగ్‌మాల్స్‌ తదితర ప్రైవేటు రంగంలో ఉండే సంస్థలు సిబ్బందిని తగ్గించేయడమో? తరువాత పిలుస్తామని చెప్పడం గానీ? వారానికి రెండుమూడు రోజుల పని విధానాన్ని గానీ అవలంభిస్తున్నాయి. ఇది అక్కడా ఇక్కడా అని గాకుండా దేశ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే కొనసాగుతోంది.

సంస్థను నమ్మి ఉద్యోగంలో చేరిన వ్యక్తి సర్వశక్తులను వాడుకున్న సదరు సంస్థలు ఇలా కష్టకాలంలో వారిని గాలికొదిలేయడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం. పేరుకు ఇరవైలక్షల కోట్ల సాయం అన్నారుగానీ ప్రాక్టికల్‌గా ఇటువంటి ప్రైవేటు ఉద్యోగుల వెతలు పట్టించుకునే కార్యాచరణమాత్రం కన్పించడం లేదన్న అభిప్రాయం జనంలో బలంగానే ఉంది. ఇంటి పెద్ద మనిషి స్థానంలో ఉండి అప్పుచేసుకోండి అంటూ సలహాలు మాత్రం ఇచ్చారంటూ సోషల్‌ మీడియా వేదికగా కేంద్రంపై భారీగానే విమర్శలు రేకెత్తుతున్నాయి.

అయితే తమకోసం పనిచేసిన ఉద్యోగులను ఆదుకోవాలన్న మనసు పెడితే వారిని ఆదుకోవడం ఆయా సంస్థలకు పెద్ద కష్టమేమీ కాదన్నదాన్ని నిజం చేస్తోంది కేరళలోని ఒక రిసార్టు యాజమాన్యం. కరోనా దెబ్బకు అందరిలాగే వారి వ్యాపారం కూడా దెబ్బతింది. దీంతో ఆలోచించి తమ రిసార్టులోని స్విమ్మింగ్‌పూల్‌లో చేపలను పెంచుతోంది. తమ వద్ద పనిచేసిన సిబ్బందిని ఇందుకోసం వినియోగించుకుంటుంది. చేపలు అమ్మకం ద్వారా సమకూరే ఆదాయాన్ని సిబ్బందికి జీతాలుగా ఇవ్వనున్నట్లు ప్రకటించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. పనిలేదు పొమ్మనేకంటే.. ఏదో ఒక రూపంలో ఉద్యోగుల కుటుంబాలను పోషించుకునే అవకాశం కల్పించడం ప్రశంసనీయమే.

తమ దగ్గర పనిచేసే సిబ్బందిని లాక్డౌన్‌లో ఇంటికి పంపించడానికి విమానం ఏర్పాటు చేసి మరీ పంపించాడో ఉదాత్తుడు. ఇటువంటి వాళ్ళూ ఉన్నారు. కానీ కష్టం వచ్చినప్పుడు ‘చేతులు’ దులిపేసుకునే వారే ప్రైవేటు రంగంలో అత్యధికశాతం మంది ఉన్నారన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఈ నేపథ్యంలో కేరళలోని రిసార్టు చేస్తున్న పనికి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రశంసలు హోరెత్తుతున్నాయి. చేతులు దులిపేసుకుంటున్న ప్రైవేటు సంస్థలు కూడా ఇలా ఆలోచించి కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు అండగా ఉండాలన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Show comments