Pravallika Case Accused Sivaram Arrested: ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. శివరామ్‌ అరెస్ట్‌

ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. శివరామ్‌ అరెస్ట్‌

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నేడు బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు అయిన శివరామ్‌ రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రవళిక మృతి తర్వాత పరారీలో ఉన్న శివరామ్‌.. తాజాగా పోలీసులకు చిక్కాడు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవళిక ఈనెల 13 రాత్రి సమయంలో.. హైదరాబాద్‌లో తాను ఉంటున్న హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గ్రూప్‌-2 పరీక్ష రద్దు కావడంతోనే ప్రవళిక ఇంతటి దారుణానికి పాల్పడిందని విపక్షాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కానీ ఆమె తల్లి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అవన్ని సద్దుమణిగాయి.

ప్రేమించిన వాడు మోసం చేయడం వల్లనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని నిర్థారించిన హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి శివరామ్‌.. తనను మోసం చేశాడన్న విషయాన్ని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా తెలిపింది. ఈ క్రమంలో ప్రవళిక సోదరుడు ప్రణయ్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. తాజాగా శివరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ప్రవళిక ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు. మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్‌ మాట్లాడిన రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. దీనిలో ఉన్న దాని ప్రకారం.. ‘మా అమ్మాయి పేరు మర్రి ప్రవళిక. రెండేళ్ల నుంచి నా బిడ్డ, నా కొడుకును హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్నాము. మా బిడ్డల జీవితాలు బాగుండాలని.. ఎన్నో కష్టాలు పడి వారిని హైదరాబాద్‌లో ఉంచి చదివిస్తున్నాము. నా బిడ్డను వాడు వేధించాడు. వాడి టార్చర్‌ గురించి మా అమ్మాయి మాతో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డ చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడు బయటికి రాకుండా చూడాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రావద్దు’’ అని చెప్పుకొచ్చింది.

అంతేకాక..‘‘మీకు, మీ పార్టీలకు గొడవలు ఉంటే మీరే చూసుకోండి. మా కుటుంబాన్ని నా బిడ్డ చావును అందులోకి లాగకండి. నా బిడ్డ ఉరి వేసుకున్నట్టే వాడికి ఉరిశిక్ష పడాలి’’ అంటూ ప్రవళిక తల్లి వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది. అలానే మృతురాలి సోదరుడు ప్రణయ్‌ కూడా.. ‘‘ప్రవళిక చనిపోవడానికి కారణం శివరాం. స్నేహితురాలి ద్వారా తను మా అక్కకు పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నాని వేధించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా అక్క డిప్రెషన్‌కు గురైంది. ఆత్మహత్య చేసుకుంది’’ అని మరో వీడియోలో పేర్కొన్నాడు.

Show comments