Idream media
Idream media
విజయవంతమైన వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నా, రాజకీయ నాయకుడిగా మారే క్రమంలో తర్జనభర్జన పడుతున్నారు. పీకే పక్కన ఉంటే విజయం మనదే అన్నంత ధీమాగా ఉన్న నేతలు పార్టీలో చేర్చుకుని ఉన్నత స్థానం ఇచ్చేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో పీకే తన రాజకీయ భవిష్యత్తు ఎంచుకోవడం లో తలకిందులవుతున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు. ఆయన సాయంతో సీఎంలు,ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఆయన మాత్రం రాజకీయ పదవికీ దూరంగా ఉంటూ వచ్చారు. ఆ మధ్య జనతాదళ్ (యునైడెట్) పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత నితీష్ కుమార్ తో పొసగక అక్కడి నుంచి బయటకు వచ్చారు. జనతాదళ్ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా పీకేను చేర్చుకుని బలం పుంజుకోవాలని ఆరాటపడింది. కానీ వచ్చిన చిక్కల్లా ఆయన అడిగిన స్థానంలో కూర్చోబెట్టేందుకు సీనియర్ల నుంచి వస్తున్న అడ్డంకులే. పీకేకు సముచిన స్థానం ఇవ్వడానికి కాంగ్రెస్ దిగ్గజాలు ఒప్పుకున్నట్లుగా లేదు. ఆయన ఆలోచనలను పార్టీకి ఉపయోగించుకుంటున్న కాంగ్రెస్, ఆయనను మాత్రం సముచిత స్థానంలో కూర్చోబెట్టడం లేదు. ఈ విషయాన్ని పీకే పసిగట్టినట్లు ఉన్నారు. అక్కడ ఇమిడిపోవడం కష్టమని భావించినట్లు ఉన్నారు. కాంగ్రెస్ లో సేద తీరుదామని అనుకున్నారు కాానీ ఇంతలోనే కాంగ్రెస్ మర్రిచెట్టు లాంటిదని గ్రహించారు. అక్కడ ఉంటే ఎదగలేమని భావించారో ఏమో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రశాంత్ కిషోర్ మమత పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తాను ఇక నుంచి వ్యూహకర్తగా పనిచేయనని ప్రకటించారు. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరడం ఖాయమని అనుకున్నారు. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ ప్రియాంకా గాంధీలను కలిశారు. ఇందుకు తగ్గట్టుగానే పీకే కాంగ్రెస్ లో చురుకైన పాత్రను పోషిస్తూ వచ్చారు. పంజాబ్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇక త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరుతారని అందరూ అనుకున్నారు. ఆయన సోనియాగాంధీకి రాజకీయ వ్యవహారాల సెక్రటరీగా బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. పీకే కాంగ్రెస్లోకి రావడంపై ప్రియాంక గాంధీీ, ఏకే అంటోనీ, కేసీ వేణుగోపాల్ ,అంబికా సోని పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకున్నారు.
అయితే హరీష్ రావత్ తో సహా అనేక మంది కాంగ్రెస్ పెద్దలు,ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహాల వరకే పరిమితం చేయాలని,పార్టీ విధానాల నిర్ణయాల యంత్రాంగంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో పీకే వెనక్కి తగ్గారు. పీకే ఎన్నికల వ్యూహకర్తగా ఇక నుంచి పనిచేయనని ప్రకటించినప్పుడు,ఇక మీరు రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా,తానో విఫలనేతనని ప్రశాంత్ కిషోర్ సమాధానమిచ్చారు. జనతాదళ్లో ఆయన ప్రయాణం మూన్నాళ్ల ముచ్చటగానే సాగింది. ఇంతలోనే కాంగ్రెస్ లో చేరి కీలకపాత్ర వహించాలని అనుకున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఆయన ఆశలపై నీళ్లు చల్లారు. ఇక్కడ లాభం లేదని తృణముల్ కాంగ్రెస్ పంచన చేరాలని భావిస్తున్నారు. తృణముల్ కాంగ్రెస్ లో ఆయనకు ఎటువంటి స్థానం లభిస్తుందో వేచి చూడాలి.
Also Read : Andhra Jyothi – Vardhan Bank Fraud Case – వర్ధన్ బ్యాంకుతో వైసీపీ ఎమ్మెల్యేకు ఏమి సంబంధం..?