Prashant Kishor – BJP : 40 ఏళ్లు బీజేపీనే.. పీకే వ్యూహాలే కాదు మనిషి కూడా అర్థం కాడు

భారత రాజకీయాల్లో ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) ఓ సంచలనం. రాజకీయనేత  కాదుగానీ ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. తన వ్యూహాలతో పలువురిని సీఎంలను చేశారు. చాణక్య, అపర చాణుక్యుళ్లు అనే వారు కూడా పీకే దెబ్బకు గింగరాలుతిరిగారు. ఆయన వ్యూహాలు అర్థంకాక తలలు పట్టుకుని, అధికారం కోల్పోయారు. ప్రత్యర్థులకు అంతుచిక్కని విధంగా ఉండే పీకే వ్యూహాలే కాదు ఆయన కూడా అర్థంకారని తాజా పరిణామాల  ద్వారా తెలుస్తోంది.

వ్యూహకర్తగా తిరుగులేని విజయాలు నమోదు చేసుకున్న పీకే రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన వేస్తున్న అడుగులు ముందుకు పడడం లేదు. నితీష్‌కుమార్‌ పార్టీలో చేరి జేడీయూ ఉపాధ్యక్షుడైన పీకే, ఆ తర్వాత కొన్ని రోజులకే బయటకు వచ్చారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో మమతాకు వ్యూహకర్తగా పని చేసిన పీకే, ఆమె మూడోసారి సీఎం అయ్యేలా పని చేశారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తర్వాత ఇకపై వ్యూహకర్తగా పని చేయబోనని చెప్పిన పీకే,కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయ నేతగా మారాలనుకున్నారు. అందుకు అనుగుణంగా పావులు కూడా కదిపారు. హస్తం అగ్రనేతలను కలిశారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు యత్నించారనే వార్తలు వచ్చాయి.

ఇక రేపో, మాపో పీకే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ పీకేకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత కలిగిన స్థానం ఇచ్చే విషయంలో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్‌ తనకు సరికాదని భావించారో ఏమో గానీ కాంగ్రెస్‌ వైపు చూడడం మానేశారు. ఆ తర్వాత తృణముల్‌ కాంగ్రెస్‌లోకి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. వీటి వెనుక పీకే ఉన్నారనే టాక్‌ నడిచింది. తృణముల్‌ కాంగ్రెస్‌లో చేరి జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయంగా పార్టీని నిలబెడతారనే విశ్లేషణలు సాగాయి. అయితే ఇవన్నీ ఏమయ్యాయో ఏమోగానీ పీకే ఒక్కసారిగా తన స్టాండ్‌ను మార్చారు.

గోవాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పీకే బీజేపీ గురించి సానుకూలంగా, అత్యంత ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలు మరో 30, 40 ఏళ్లు బీజేపీ కేంద్రంగానే సాగుతాయని చెప్పారు. మోదీకి ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదన్నారు. రాహుల్‌ గాంధీ ఈ విషయం గుర్తించడం లేదని,  మోదీని విసిరికొడతారనే భ్రమలోనే ఆయన ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. బహుశా రాహుల్‌ సమస్య కూడా ఇదేమోనన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి.. మోదీ ఎంత బలంగా ఉన్నారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటి పరిస్థితుల్లో ఎవరూ మోదీకి ఎదురు వెళ్లలేరని చెప్పిన పీకే.. సరికొత్త చర్చలకు తెరలేపారు.

2014 ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పని చేసిన పీకే.. ఆ తర్వాత బీజేపీకి, మోదీకి దూరమయ్యారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు పని చేయడం ప్రారంభించారు. ఈ పదేళ్లలో ఆయన పలు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ నేతలతో ఢీ అంటే ఢీ అనేలా పని చేశారు. తమ పార్టీకి 200 సీట్లు రాబోతున్నాయని అమిత్‌ షా అంటే.. బీజేపీ రెండంకెలకే పరిమితం అవుతుందని, మూడంకెలు వస్తే తాను వ్యూహకర్తగా ఇకపై పని చేయబోనని సవాల్‌ చేశారు. ఈ స్థాయిలో బీజేపీ నేతలో ఢీ కొన్న పీకే.. ఇప్పుడు ఆ పార్టీ పట్ల అత్యంత సానుకూలంగా మాట్లాడడమే అంతుచిక్కని విషయం. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో పీకే రాజకీయ అడుగులు భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.

Also Read : PK Prasanth Kishore – రాజకీయాలకు పనికిరానంటున్న పీకే

Show comments