అనుకున్నదే అయింది. పాండిచ్చేరిలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో ఇప్పటికే మైనారిటీలో పడిన ప్రభుత్వం సోమవారం బలనిరూపణ ఓటింగ్ కు వెళ్లకుండానే సీఎం నారాయణస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ సై కు రాజీనామా అందించారు. ఆదివారం సాయంత్రమె మరో ఇద్దరు కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అందరూ అనుకున్నట్లుగానే సోమవారం పాండిచ్చేరి అసెంబ్లీలో నారాయణ స్వామి బలాన్ని నిరూపించుకునే ఓటింగ్లో పాల్గొనేందుకు కూడా ఇష్టపడలేదు.
విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే..
ప్రభుత్వం మైనారిటీలో పడడంతో విపక్షాలు ప్రభుత్వం మీద విశ్వాస పరీక్ష నూ ప్రతిపాదించాయి. దీంతో సోమవారం పుదుచ్చేరి శాసనసభ ప్రత్యేకంగా సమావేశం అయింది. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానంపై సభ్యుల ఓటింగ్ జరగకముందే ముఖ్యమంత్రి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో విశ్వాస తీర్మానం వీగిపోయిన ట్లు స్పీకర్ వి.పి. శివ కొలం దు ప్రకటించారు. అక్కడినుంచి సిఎం తన పదవికి రాజీనామా చేసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. తమిళసై కు తన రాజీనామాను ముఖ్యమంత్రి అందజేశారు.
కుట్ర చేశారు…
సీఎం నారాయణస్వామి శాసనసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. డీఎంకే మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ గెలిచామని తమకు ప్రజల మద్దతు ఉందని ఆయన చెప్పారు. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షం తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. అలాగే పాండిచ్చేరి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, ప్రభుత్వ కార్యకలాపాలను కిరణ్బేడీ అడ్డుకున్నారంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఇది కేవలం బిజెపి కుట్రగా ఆయన అభివర్ణించే ప్రయత్నం చేశారు.
12 కు చేరిన కాంగ్రెస్… 14 కు ప్రతిపక్షాలు
అనూహ్యంగా పాండిచ్చేరి రాజకీయాలు మారిపోయాయి. అటు ఇటు ఇటు అటు సంఖ్య తారుమారు అయింది. నిన్న మొన్నటి వరకు 18 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం నడిపిన కాంగ్రెస్ కూటమి బలం సోమవారానికి కేవలం 12 మంది సభ్యులకు పడి పోయింది. ఇక ప్రతిపక్షం ఎన్ ఆర్ కాంగ్రెస్ కూటమి బలం14 గా ఉంది. ఏడు మంది ఎన్ ఆర్ కాంగ్రెస్ సభ్యులు, నలుగురు అన్నాడీఎంకే సభ్యులతోపాటు బిజెపి తరఫున నామినేటెడ్ భాజపా ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు.
ప్రస్తుతం పుదుచ్చేరి అసెంబ్లీ కు 26 మంది సభ్యులు ఉంటే, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 14 మంది సభ్యుల బలం అవసరం. మరిప్పుడు ఎన్ ఆర్ కాంగ్రెస్ కూటమి భాజపా నామినేటెడ్ సభ్యులతో కలిసి పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేక ఎన్నికలకు వెళ్తుందా అనేది కీలకంగా మారింది. ఈ సమయంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభ ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమ మార్గంగా ఎన్ ఆర్ కాంగ్రెస్ కూటమి కూడా ఆలోచిస్తూ ఉండటం తో పుదుచ్చేరి ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది.