Idream media
Idream media
25 ఏళ్ల రాజకీయ ప్రయాణం… ఈ మాట చెప్పి ఇప్పటికే 7 యేళ్లు. 25 ఏళ్ల రాజకీయ ప్రయాణం లో తనతో కలిసి రావాలని పిలుపునిచ్చి… కూడా 7 ఏళ్లు అవుతోంది. రాజకీయంగా స్వార్ధం లేని వారు ప్రజల కోసం మాత్రమే బ్రతికే వారు తనతో కలిసి రావాలని అలాంటి వారికి తాను వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు నిలబెడతా అని హామీ ఇచ్చి కూడా 7 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఆ హామీని నమ్మిన వాళ్లు కానీ ఆ హామీ కోసం నడిచిన వాళ్ళు గానీ లేరనే అభిప్రాయం బలపడుతోంది.
హామీ ఇచ్చింది ఎవరు… ఏంటీ అనేది ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. 2014లో జనసేన పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అప్పట్లో కాస్త సంచలనమైంది. 25 ఏళ్ల రాజకీయ ప్రయాణం కోసం మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, భావితరాలకు ఆదర్శంగా నిలవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని, పీడిత ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చా అని, పోరాటం చేయడానికి అన్నీ వదులుకుని సిద్ధపడ్డా అని పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రసంగాలు చేశారు.
2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ఇచ్చి 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని భావించి కమ్యూనిస్టులతో కలిసి ముందుకు వెళ్లి… కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలిచారు. రెండు చోట్ల పోటీ చేస్తే పార్టీ అధినేతగా కనీసం ఒక చోట అయినా సరే పవన్ కళ్యాణ్ గెలవలేక పోవడం ఆయనను ఇప్పటికీ వెంటాడుతున్న బాధ. రాజకీయంగా పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి పెద్దగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పేస్ లేకపోయినా తనకంటూ ప్రత్యేకంగా ఒక మార్గాన్ని సృష్టించుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తారని అందరూ భావించారు
భారతదేశంలో విశేష అభిమానులున్న… హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. ఏ హీరోకి అంతగా యూత్ లో ఫాలోయింగ్ లేదనే చెప్పాలి. కానీ దాన్ని కార్యకర్తల బలం గా మార్చుకునే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఘోరంగా విఫలం అవుతూనే వచ్చారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్య పరిచాయి. ఏడేళ్ల తర్వాత కూడా 25 ఏళ్ల రాజకీయ ప్రయాణం కోసం మాత్రమే తనతో కలిసి రావాలని పవన్ కళ్యాణ్ చెప్పడం ఆశ్చర్యపరిచింది.
ఈ 7 ఏళ్ల కాలంలో ఒక్క నాదెండ్ల మనోహర్ మినహా మరే నాయకుడు పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వలేదు. జనసేన పార్టీ రాజకీయ ప్రయాణంలో మేము కూడా ఉన్నాము అని చెప్పడానికి కనీసం ఆయన సొంత సామాజికవర్గ నాయకులు కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. కనీసం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న నాయకులు కూడా ఆయన వెంట నడవడానికి సిద్ధపడలేదు. 2009లో చిరంజీవి నమ్మిన చలమలశెట్టి సునీల్ లాంటివాళ్ళు పవన్ కళ్యాణ్ ని 2019లో నమ్మటానికి ఇష్టపడలేదు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీలోకి వచ్చిన సరే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చక ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అలాగే బిజెపి నుంచి కొంతమంది నాయకులు వస్తారని కామినేని శ్రీనివాస్ అలాగే విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ వేచి చూస్తున్నారని గంటా శ్రీనివాసరావుతో ఫోన్లలో మాట్లాడుతున్నారని… ఏపీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని అప్పుడప్పుడు వార్తలు రావడమే కానీ ఏ ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ ని నమ్మిన పరిస్థితి లేదు.
25 ఏళ్ల రాజకీయ ప్రయాణం అని చెప్పడమే గాని పార్టీలోకి వచ్చే నాయకులకు భవిష్యత్తుపై భరోసా కల్పించే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఘోరంగా విఫలమవుతున్నారు. ఇతర పార్టీలో ఉండి అసహనంగా ఉన్న అగ్ర నాయకులను, ప్రజల్లో ఆదరణ ఉన్న మాస్ నాయకులను తనవైపుకు తిప్పుకునే విషయంలో పవన్ కళ్యాణ్ విఫలం అవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం గురించి పక్కనపెట్టి కనీసం తన తో వచ్చే నాయకులు ఎవరు ఏంటి అనేది దానిపై ఒక స్పష్టత తెచ్చుకుని ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయకపోతే ఎన్ని ప్రసంగాలు చేసిన ఏ విధమైన విమర్శలు చేసిన ఆ రోజు మాత్రమే మీడియాలో పెద్దగా ప్రజల్లో చర్చ జరిగే పరిస్థితి ఉండక పోవచ్చు. కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ప్రసంగాలు మాత్రమే కాకుండా చేతల్లో కూడా చూస్తున్నారు. మాస్ నాయకులను ఆకట్టుకునే విషయంలో పవన్ కళ్యాణ్ విఫలం కావడం కార్యకర్తలను మరింత ఇబ్బంది పెడుతున్న అంశం. మరి ఈ సమస్యలను పవన్ కళ్యాణ్ ఎప్పుడు పరిష్కరించుకుంటారు చూడాలి.