అప్పుడలా.. ఇప్పుడిలా

ఒక్క విజయవాడ నగరంలోనే అభివృద్ధి పేరిట చిన్నాపెద్దా కలిపి దాదాపు నలభైవరకు ఆలయాలు, హిందూ మత సంబంధిత కట్టడాలూ కూలగొట్టేసారు. ఇంకా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హిందువేతర మతాలకు చెందిన ప్రార్ధనా స్థలాలు, వ్యక్తులపై కూడా దాడులు జరిగాయి. ఆయా ఘటనలపై ఏ నాడూ పూర్తిస్థాయి విచారణలు లేవు. చర్యలు కానరావు.

పిఠాపురంలో విగ్రహా ధ్వంసం, అంతర్వేది రథం అగ్ని ప్రమాదం, దుర్గగుడికి చెందిన రథం సింహపు బొమ్మ మాయం కావడం. వీటిపై వెంటనే ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులతో సమగ్ర దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది.

పై రెండు పాయింట్లలోనూ మొదటిది ప్రభుత్వం చేసే పనుల్లో భాగంగా హిందూ మత సంబంధిత కట్టడాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ అవి ధ్వంసం అవుతాయని అప్పటి ప్రభుత్వానికి తెలుసు. అయినాగానీ ముందు కెళ్ళారు. అంటే ఆ ఘటనలో ప్రభుత్వ ప్రమేయం నేరుగా ఉంది.

రెండో పాయింట్‌ విషయంలో ప్రభుత్వానికి తెలియదు. సంఘటన జరిగిన తరువాత ఆ సంఘటనకు సంబంధించి విచారణ చేయడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో భద్రతా చర్యలను పునఃసమీక్షించే విధంగా అధికారులను అప్రమత్తం చేసారు.

మొదటిది చంద్రబాబు ప్రభుత్వ హాయంలో కాగా, రెండవది జగన్‌ హయాంలోనిది. కానీ రెండు ఘటనలను గురించి ఏపీలోని ప్రధాన మీడియాలుగా భావించే కొన్ని పేపర్లు, టీవీలు, సోషల్‌ మీడియాల్లో మాత్రం జగన్‌ ప్రభుత్వ హాయంలో జరిగినవి మాత్రమే బ్యానర్‌లు, ప్రధాన స్టోరీలుగా వస్తున్నాయి. వాటిపై భారీగా డిబేట్లు కూడా పెట్టేస్తున్నారు. అంటే చంద్రబాబు హాయంలో వీరంతా ఎక్కడున్నట్లు, హిందూ మతంపై వీరికి ఉన్న భక్తిభావం ఏమైనట్టు.

ఇక్కడ స్పష్టంగా చెప్పేదొకటే జరిగిన సంఘటన ఎప్పుడు జరిగినా అందులోని తప్పొప్పులు ప్రజలకు తప్పకుండా తెలియజేయాలి. ఇది మీడియా పని. కానీ మనవాడు ఉన్నప్పుడు తక్కువ తప్పుగాను, ఎదుటోడు ఉన్నప్పుడు ఎక్కవ తప్పుగా చూపిస్తేనే ఆక్షేపణలొస్తున్నాయి.

ప్రస్తుతం జగన్‌ ఫోబియాలో బ్రతుకుతున్న సదరు మీడియాకు తెలియడం లేదు గానీ ప్రజలు మాత్రం ఈ తప్పొప్పులు ఎంచడంలో చూపిస్తున్న వలపత్యాన్ని చక్కగానే అర్ధం చేసుకుంటున్నారు. అందుకే సదరు సంస్థల టీఆర్పీ రేటింగులకు కోత పెట్టిస్తున్నారు. ప్రజల నమ్మకం అనే కొమ్మపై కూర్చున్నామన్న కనీస జ్ఞానం కూడా లేకపోవడంతో సదరు సంస్థలు ఆ కొమ్మనే నరికేసుకుంటున్నాయన్న వాస్తవాన్ని ఇంకెప్పుడు గుర్తిస్తాయో మరి.

Show comments