శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా అధికారుల చొరబాటు

ఇంతకాలం విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని కొఠియా గ్రామాలకే పరిమితమైన ఆంధ్ర-ఒడిశా సరిహద్దు వివాదం తొలిసారి శ్రీకాకుళం సరిహద్దుల్లోనూ మొదలైంది. ఒడిశా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆంధ్రకు చెందిన ఒక అంగన్ వాడీ కేంద్రానికి తాళాలు వేయడమే కాకుండా.. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి తీసుకెళ్లడం ఆ ప్రాంతంలో అలజడి రేపింది. మందస మండలం సాబకోట పంచాయతీ మాణిక్యపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన.. రెండు రాష్ట్రాల మధ్య లేని కొత్త వివాదాన్ని సృష్టించిందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఒడిశా భూభాగంలో ఏర్పాటు చేశారంటూ..

శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాల్లో ఒడిశాతో మన రాష్ట్రానికి సరిహద్దులు ఉన్నాయి. వాటిలో మందస మండలం ఒకటి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడు మండలాల సరిహద్దుల విషయంలో ఏనాడూ వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకోలేదు. విభజన హద్దులు క్లియర్ గా ఉండటంతో రెండు రాష్ట్రాలు ఎవరి పరిధిలో వారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే ప్రకారం మందస మండలం మాణిక్యపురంలో ఆంధ్ర ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే అంగన్ వాడీ కేంద్రం ఏర్పాటు చేసి కొనసాగిస్తోంది. ఒడిశా అధికారులకు ఏమైందోగానీ ఉన్నట్టుండి మాణిక్యపురంలోకి చొరబడి.. అది తమ రాష్ట్ర భూభాగమని, ఇక్కడ ఆంధ్ర అధికారులు అక్రమంగా అంగన్ వాడీ కేంద్రం ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ దానికి తాళాలు వేసి సీజ్ చేశారు. అంగన్ వాడీ కార్యకర్త సవర లక్ష్మి, ఆమె భర్త, కొందరు స్థానికులు అభ్యంతరం చెబుతూ అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. పైగా తమకు అడ్డుచెప్పినందుకు అంగన్ వాడీ కార్యకర్త భర్తను అరెస్టు చేసి పర్లాఖిమిడి పోలీస్ స్టేషనుకు తీసుకుపోయారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఏపీ అధికారులు గ్రామానికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మాణిక్యపురం పక్కా ఆంధ్ర భూభాగమని అధికారులు స్పష్టం చేశారు. ఒడిశా అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఒడిశా అధికారులు తీసుకెళ్లినా కార్యకర్త భర్తను విడిపించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ఒడిశా దురాక్రమణ

ఆంధ్ర, ఒడిశాల మధ్య విజయనగరం జిల్లాకు చెందిన 21 కొఠియా గ్రామాల విషయంలోనే దశాబ్దాలుగా వివాదం నలుగుతోంది. 1968 నుంచి కొనసాగుతున్న ఈ వివాదంపై సుప్రీంకోర్టు కూడా ఎటూ తేల్చకుండా రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ వివాదం ఇప్పటికీ నలుగుతోంది. ఇటీవల సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర కొఠియా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెళ్లినప్పుడు ఒడిశా అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో చేరుకొని అడ్డంకులు సృష్టించి ఉద్రిక్తతలు రేపారు. అయితే శ్రీకాకుళం జిల్లా పరిధిలో మాత్రం మొదటి నుంచి సరిహద్దు వివాదాలు అసలు లేవు. ఇరురాష్ట్రాల ప్రజలు స్నేహ సంబంధాలతో కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇక్కడ కూడా ఒడిశా అధికారులు కొత్త వివాదం రేపి వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒడిశా అధికారుల దుందుడుకు వైఖరి మరో అంతర్రాష్ట్ర సమస్యకు బీజం వేసేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Also Read : బడేటి బుజ్జి కి ప్రత్యామ్నాయం ఎవరు?

Show comments