తెలంగాణలో లాక్ డౌన్ సడలింపు లేదు.. మే 7 వరకు కొనసాగింపు..సీఎం కేసీఆర్ ప్రకటన..

ఈ నెల 20 నుంచి లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయగా.. వైరస్ కట్టడి కోసం తెలంగాణ లో ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం కొద్దిసేపటి క్రితం ఆయన మీడియా తో మాట్లాడారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు. మే మొదటి కల్లా తెలంగాణ లో వైరస్ నియంత్రణ లోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మే 5 న మంత్రి వర్గ సమావేశం నిర్వహించి.. అప్పటి పరిస్థితి ని బట్టి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తెలంగాణలో ఇప్పటివరకు 858 మందికి కరోనా సోకిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో 186 మంది కోరుకొని ఇంటికి వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం 651 మంది చికిత్స సాగుతుందని తెలిపారు. 21 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తెలంగాణలోని 33 జిల్లాల గా నాలుగు జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం లేదని తెలిపారు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్క కేసు లేదన్నారు.

దేశవ్యాప్తంగా ప్రతి పది లక్షల మంది జనాభాకు 254 మంది పరీక్షలు నిర్వహిస్తుండగా అది తెలంగాణ 375 గా ఉందని తెలిపారు. మరణాల రేటు దేశం మొత్తం మీద 3.22 శాతంగా ఉండగా తెలంగాణలో 2.44 శాతం మాత్రమే ఉందని చెప్పారు. దేశంలో ప్రతి ఎనిమిది రోజులకు ఒకసారి కేసులు రెట్టింపు అవుతుండగా, తెలంగాణలో మాత్రం పది రోజులకొకసారి కేసులు రెట్టింపు అవుతున్నాయని చెప్పారు. కరోనా వైరస్ బారినపడిన వారి కోసం ఉపయోగిస్తున్న ఔషధాలు తెలంగాణలో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

మే నెలకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్న రేషన్కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కేజీల చొప్పున రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతే కాకుండా ఈ నెల ఇచ్చినట్లుగానే మే నెలలో ను ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. మే 7వ తేదీ లోపు 1500 లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తా జమ చేస్తామని తెలిపారు. ఖాతాలో జమ చేసిన డబ్బు వెనక్కి పోతుందని చేసే పుకార్లను నమ్మవద్దని సీఎం కేసీఆర్ సూచించారు. వలస కూలీల కు రేషన్ కార్డు దారులకు ఇచ్చినట్లు గానే 12 కేజీల బియ్యం, పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. వలస కూలీ ఒక్కరు మాత్రమే ఉంటే 12 కేజీల బియ్యం, 500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో అమలు లో ఉన్న స్విగ్గి, జోమాటో ఫుడ్ డెలివరీ సర్వీస్ ను నిషేధిస్తున్నట్లు తెలిపారు. సామూహిక ప్రార్థనలు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబడవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ మతం వారైనా ఇళ్లలోనే పూజలు, ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ఏ మతానికి సంబంధించిన సామూహిక కార్యక్రమాలు అనుమతించబోమని తెలిపారు. ప్రజల ప్రాణాలు, సమాజం భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య పనుల, శానిటైజేషన్ చక్కగా జరుగుతుందని పేర్కొన్నారు. పంచాయతీలు, పురపాలక సంఘాల పాలకమండళ్లు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాయని సీఎం కేసీఆర్ కొనియాడారు. వలస కూలీలు, పేదలను ఆదుకునేందుకు అందరూ ముందుకు వస్తున్నారని సీఎం కేసీఆర్ కొనియాడారు. పేదలను, అభాగ్యులను ఆదుకుంటున్న దాతలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా 100 కి ఫోన్ చేయాలని సూచించారు.

గత నెలలో మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు జీతాల్లో కోత ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెన్షనర్లకు గతం గత నెలలో ఇచ్చిన 50 శాతాన్ని ఈనెల 75% చేస్తున్నామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య, జిహెచ్ఎంసి, పురపాలక, పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి సీఎం గిఫ్ట్ కింద నగదు ప్రోత్సాహకం ఈనెల కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈనెల కొత్తగా పోలీసులకు సీఎం గిఫ్ట్ కింద నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. విద్యుత్ శాఖలో ఓ అండ్ ఎం లో పనిచేస్తున్న సిబ్బందికి 100% జీతాలు ఉన్నట్లు తెలిపారు. గత నెలలో వీరికి 50 శాతం మాత్రమే ఇచ్చారు.

ఇళ్ల యజమానులు మార్చి, ఏప్రిల్, మే మూడు నెలలకి అద్దె వసూలు చేయకూడదని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కష్టకాలంలో అద్దెకు ఉన్న కుటుంబాలను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఈ మూడు నెలల కిరాయని భవిష్యత్తులో వాయిదాల పద్ధతిలో తీసుకోవాలని సూచించారు. దీనిపై ఎలాంటి వడ్డీ వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ఎవరైనా అద్దె కోసం ఇబ్బంది పెడితే 100 కి ఫోన్ చేయొచ్చు అని సూచించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటి పన్ను మే 30 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చని సూచించారు.

వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచడానికి వీలులేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే నెలవారీ వసూలు చేసుకోవాలని సూచించారు. అది తప్ప మరే ఫీజును వసూలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఎవరైనా విద్యాసంస్థలు తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే 100 కి ఫోన్ చేయాలని సూచించారు. అలాంటి విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ధాన్యం తోపాటు ఇతర పంట ఉత్పత్తులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెంది తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్ముకోవద్దని సూచించారు. ఆహార లోటు తలెత్తకుండా వ్యవసాయ పనులు, వ్యవసాయ అనుబంధ రంగాలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాబోయే పంట సీజన్లో తెలంగాణలో 1.35 కోట్ల ఎకరాల్లో వరి పంట సాగు జరిగే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత నెల రోజుల పాటు కూడా ఎలాంటి శుభకార్యాలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. ఫంక్షన్ హాల్ లను ఎరువులు, విత్తనాల నిల్వకు తాత్కాలిక గోదాములుగా ఉపయోగించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచేందుకు.. ఫిస్కల్ పాలసీ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనను సడలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయన్న విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు.

Show comments