Nellore Corporation – ఎవరి దారి వారిదేనా..?

పొత్తు రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌ను బీజేపీ, జనసేన పార్టీలు సృష్టిస్తున్నాయి. పొత్తు.. అంటే కలసి పోటీ చేసి అధికారం సంపాదించడం. ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారు..? ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి..? ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి..? అనే సన్నద్ధత పొత్తులు పెట్టుకున్న పార్టీల మధ్య ఉంటుంది. కానీ బీజేపీ, జనసేనల మధ్య పేరుకే పొత్తు కానీ.. పొత్తులో ఉండే పార్టీలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం కనిపించడం లేదు. తిరుపతి ఉప ఎన్నిక మినహా బద్వేలు ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలు రెండు  కలిసి కూర్చుని పోటీపై మాట్లాడుకున్న పరిస్థితి కనిపించలేదు.

తాజాగా జరుగుతున్న మినీ మున్సిపల్‌ ఎన్నికలు, మిగిలిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లోనూ.. ఆ రెండు పార్టీల మధ్య పోటీ అనే ప్రస్తావనే రాలేదు. ఈ ఎన్నికలపై ఆ రెండు పార్టీల మధ్య చర్చనే జరగలేదు. బుధవారం నామినేషన్ల కార్యక్రమం మొదలైంది. ఈ రోజు కూడా నామినేషన్లు స్వీకరిస్తున్నారు. రేపు శుక్రవారం సాయంత్రంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. అయినా బీజేపీ, జనసేనల మధ్య ఈ ఎన్నికల ప్రస్తావనే రానట్లుగా ఉంది. అందుకే స్థానికంగా ఉన్న నేతలు.. ఎవరికి వారు తమ ఆసక్తి మేరకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొదటి రోజు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ తరఫున 12 నామినేషన్లు దాఖలవగా.. జనసేన పార్టీ తరఫున ఇద్దరు, మరో ఇద్దరు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. మొదటి రోజు టీడీపీ జాడ కనిపించలేదు. బీజేపీతో సంబంధం లేకుండానే జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. రేపు సాయంత్రం లోపు ఏ పార్టీ ఎన్ని డివిజన్లలో నామినేషన్లు వేస్తుందో తెలుస్తుంది. ఎవరికి వారు తమకు బలం ఉన్న చోట నామినేషన్లు వేసిన తర్వాత.. మద్ధతుపై ఇరు పార్టీల నేతలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటారా..? అనేది చూడాలి.

2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలసి ఎన్నికలకు వెళ్లిన జనసేన.. ఎన్నికలు ముగిసిన తర్వాత వారికి బై చెప్పేసి.. బీజేపీ హాయ్‌ చెప్పింది. మొదట్లో బీజేపీతో పొత్తుపై జనసేన ఆసక్తిగా ఉండగా.. ఆ తర్వాత బీజేపీ ఎక్కడలేని ఆసక్తిని చూపిస్తూ.. ఏకంగా 2024 ఎన్నికల్లో అధికారంపై కలలు కనడం ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. సందర్భం వచ్చిన ప్రతిసారి జనసేనతో కలసి అధికారంలోకి వస్తాం.. అంటూ ప్రకటనలు చేశారు. అయితే జనసేన నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. బీజేపీతో పొత్తు ఉండీ లేనట్లుగానే జనసేన వ్యవహరిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు బలంగా ఉన్నట్లు కనిపించగా.. బద్వేలు ఉప ఎన్నికలకు వచ్చే సరికి అంతంత మాత్రంగా ఉన్నట్లు.. తాజాగా మినీ మున్సిపల్‌ ఎన్నికల్లో అసలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్లుగా పరిస్థితి ఉండడం గమనార్హం.

Also Read : Tdp,Janasena – Akiveedu మరోసారి తెరమీదకు టీడీపీ జనసేన బంధం .. ఈసారి ఆకివీడు వేదికగా!

Show comments