Idream media
Idream media
మోత్కుపల్లి నరసింహులు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మంత్రిగా పని చేసిన అనుభవం, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నేత. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీకి భవిష్యత్‌లేదని తెలిసినా.. చంద్రబాబునాయుడు తనను గవర్నర్‌ను చేస్తాడనే ఆశతో ఆ పార్టీలోనే కొనసాగిన మోత్కుపల్లికి చివరికి తత్వం బోధపడి.. చంద్రబాబును మాటలతో చీల్చిచెండాడి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. బీజేపీలో చేరినా పెద్దగా ఫలితం కనిపించని సమయంలో.. హుజురాబాద్ ఉప ఎన్నికలు రావడం, తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధు అనే కొత్త పథకాన్ని ప్రకటించడంతో మోత్కుపల్లి అవకాశాలను అందిపుచ్చుకునే పనిలో పడ్డారు. ఈ పథకంపై నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేతల ఆదేశాలను తోసిపుచ్చి హాజరైన మోత్కుపల్లి.. కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకున్నారు. బీజేపీకి గుడ్‌బై చెప్పారు.
కమలం పార్టీని వీడిన మోత్కుపల్లికి దళితబంధు చైర్మన్ పదవిని కేసీఆర్ కట్టబెడతారనే ప్రచారం రెండు నెలల కిందట సాగింది. ఇక మోత్కుపల్లి కారు ఎక్కడం, దళితబంధు చైర్మన్ సీటులో కూర్చొవడం లాంఛనమే అనుకున్నారు. ఎట్టకేలకు మోత్కుపల్లికి చాలా కాలం తర్వాత ఓ పదవి వచ్చేసిందనుకున్నారు. కానీ రెండు నెలలైనా.. చైర్మన్ పదవి రాలేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యం, మరో వైపు అసెంబ్లీ సమావేశాల్లో దళితబంధుపై సుదీర్ఘ చర్చ జరుగుతున్న సమయంలో మరోసారి మోత్కుపల్లి నరసింహులు తెరపైకి వచ్చారు. మోత్కుపల్లిని సీఎం కేసీఆర్ తన వెంటబెట్టుకుని అసెంబ్లీకి వెళ్లడం మరోసారి ఆయనకు పదవిపై చర్చ మొదలైంది.
దళితబంధు పథకం ఏడాది కిందటే అమలు చేయాల్సిందని, కానీ కరోనా వల్ల సాధ్యం కాలేదన్న కేసీఆర్.. వచ్చే ఏడాది దళిత బంధు పథకం కోసం 20 వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయిస్తామని అసెంబ్లీలో పేర్కొన్నారు. పథకం ఓ రూపు సంతరించుకుంటుండడం, హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న సమయంలో.. ఆ నియోజకవర్గంలోదళిత ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మోత్కుపల్లికి దళితబంధు చైర్మన్ పదవిని కట్టబెడతారనే చర్చ జోరుగా సాగుతోంది. రెండు మూడు రోజుల్లో మోత్కుపల్లి కారు ఎక్కడం, ఆ వెంటనే దళిత బంధు చైర్మన్ పదవిని కేటాయించడం లాంఛనమేననే ప్రచారం జరుగుతోంది. మరి ఈ సారైనా జరుగుతున్న ప్రచారం వాస్తవరూపం దాల్చి మోత్కుపల్లికి చైర్మన్ గిరి దక్కుతుందా..? లేదా..? చూడాలి.
Also Read : రాజకీయ సన్యాసం చేస్తానంటున్న ఈటెల