iDreamPost
iDreamPost
హైదరాబాద్ లో కాలుపెట్టడానికి కొద్ది గంటల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి ప్రశ్నలను సంధించారు. మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కూడా నెరవేరలేదు. టార్చిలైట్ వేసి వెతికినా, ఏ ఒక్కటీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం అన్ని రకాల ధరలను పెంచేసింది, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోయాయని కేసీఆర్ మండిపడ్డారు. వీటికి తోడు నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టారన్నారు. వారి సుదీర్ఘ ఉద్యమంలో కొందరు రైతులు మరణించారు. వారి కుటుంబాలకు రూ. 3 లక్షలు ఇస్తే, బీజేపీ ఎందుకు తమను చులకనగా చూసిందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత సిన్హాకు మద్దతుగా జలవిహార్ లో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడారు.
యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున హృదయపూర్వక స్వాగతం పలికారు. యశ్వంత్ సిన్హా ది ఉన్నత వ్యక్తిత్వం. న్యాయవాదిగా కెరీర్‌ను మొదలుపెట్టారు, వివిధ హోదాల్లో, దేశానికి అత్యుత్తమ సేవలందించారని ప్రశంసించారు కేసీర్. ఆర్ధికమంత్రికా ఆయన గొప్పగా పనిచేశారు. అన్ని రంగాల్లో విశేష అనుభవమున్న యశ్వంత్ సిన్హాది భారత రాజకీయాల్లో కీలకపాత్ర అని అన్నారు. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్న కేసీఆర్ . ఓటు వేసేటప్పుడు రాష్ట్రపతి అభ్యర్థులను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.
మోదీపై విమర్శలను ఎక్కుపెట్టిన కేసీఆర్, బీజేపీ పాలనలో తిరోగమనమే అని వ్యాఖ్యానించారు. మోదీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. ఆయన ప్రధానిగా కాకుండా, దేశానికి సేల్స్‌మెన్‌గా, పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంలో శ్రీలంకను ప్రస్తావించిన కేసీఆర్, మోదీకి వ్యతిరేకంగా శ్రీలంకలో ప్రజలు నిరసనలు చేశారని, మరి ప్రధానికి మౌనమెందుకని ప్రశ్నించారు. శ్రీలంక నిరసనలపై స్పందించకుంటే, మోదీని దోషిగానే చూడాల్సివస్తుందన్నారు.
వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారన్నది కేసీఆర్ మారో విమర్శ. అవినీతిరహిత భారత్ అని, ప్రధాని మోదీ పెద్ద మాటలు చెప్పారని, ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లధనం నియంత్రణ కాదు, రెట్టింపైంది. ఇదేనా వికాసం? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన ఆ తర్వాతకూడా విమర్శల డోసు పెంచారు. మోదీ ప్రధానిగాకాదు, దోస్త్ కోసం షావుకార్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు.
మోదీ పనితీరుతో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, సైనికులు ఇబ్బందిపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారుతోంది. సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నా, విదేశాలనుంచి బొగ్గు కొనాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీచేస్తున్నదని కేసీఆర్ మండిపడ్డారు. అలాంటి మోదీ, ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెబుతారని హేళన చేశారు.
రైతు చట్టాలు సరైనవేనని బీజేపీ చెబుతోంది. మరి వాటిని వెనక్కు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. మీరు దేశం ముందు తలదించుకున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శించారు కేసీఆర్.
ఈ ప్రశ్నలన్నింటికి హైదరాబాద్ వేదికగా ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.