ఎమ్మెల్సీ(ఉపాధ్యాయ)లకు బహుముఖ పోరు

ఎమ్మెల్సీ ఎన్నికల పోరుతో ఉపాధ్యాయ సంఘాలు, వర్గాల్లో సందడి ఏర్పడింది. రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి..? ఎవరికి మద్దతు ఇవ్వాలి..? అనే అంశాలపై ఆయా సంఘాలలో తర్జనభర్జన. మొదలైంది. ఆయా స్థానాల్లో బహుముఖ పోరుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మార్చి 14న కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధాన ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పలువురు, స్వతంత్ర అభ్యర్థులుగా మరి కొందరు, రాజకీయ నేపథ్యంతో ఇంకొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.

మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మరోసారి కృష్ణా-గుంటూరు నియోజకవర్గం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ (1938) సంఘాలతో పాటు పలు అధ్యాపక సంఘాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. ఏపీటీఎఫ్‌ (257) అభ్యర్థిగా పరుచూరి పాండురంగ వర ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. ఆయన గత తొమ్మిదేళ్లుగా ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యాయ ఉద్యమంలో పని చేస్తున్నారు. ఆయనకు డీటీఎఫ్‌, పలు అధ్యాపక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎ.ఎస్‌.రామకృష్ణ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకు తెలుగుదేశం అనుబంధ టీఎన్‌యూఎస్‌తో పాటు పలు అధ్యాపక సంఘాలు మద్దతు ప్రకటించాయి.

కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి రెండు నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) విజయానంద్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బట్టు శ్యాంప్రసాద్‌ ఇండిపెండెంట్‌గా ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయగా.. తూర్పు-పశ్చిమగోదావరి ఎమ్మెల్సీ స్థానానికి గంటా నాగేశ్వరరావు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Show comments