Mini Municipal Elections – టీడీపీ పొత్తుల రాజకీయం.. అదే లక్ష్యమా..?

ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీ.. ప్రస్తుతం జరుగుతున్న మినీ మున్సిపల్‌ పోరులో చెప్పుకోదగ్గ సీట్లయినా గెలుచుకుని పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఒంటరిగా వెళితే.. గత ఫలితమే పునరావృతం అవుతందనే విషయం బాగా తెలిసిన టీడీపీ.. ఈ ఎన్నికల్లో పొత్తు అస్త్రాన్ని వాడుతోంది. స్థానికంగా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు.

నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అన్ని చోట్లా టీడీపీ భారీగా నామినేషన్లు వేసింది. అదే సమయంలో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోంది. దీనికి స్నేహపూర్వక పొత్తు అనే పేరు పెట్టింది. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు 471 నామినేషన్లు దాఖలు కాగా.. టీడీపీ నుంచే అత్యధికంగా 155 నామినేషన్లు వచ్చాయి. ఇక్కడ సీపీఎంతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. సీపీఎం 28 నామినేషన్లు దాఖలు చేసింది. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య చర్చలు సాగుతున్నాయి. మరో వైపు బీజేపీ, జనసేన పార్టీలు కూడా వస్తే.. నాలుగు పార్టీలు కలసి పోటీ చేసేందుకు టీడీపీ ఆసక్తి చూపిస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగర పంచాయతీలోనూ ఇదే సీను కనిపిస్తోంది. నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా.. 126 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైసీపీ 52, టీడీపీ 41, జనసేన 12, సీపీఎం 6, బీజేపీ 02, కాంగ్రెస్‌ 1, స్వతంత్రులు 11 మంది నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక్కడ టీడీపీ పొత్తు రాజకీయం నెల్లూరుకు భిన్నంగా సాగుతోంది. బీజేపీ, జనసేనతో టీడీపీ ముందుగానే ఓ అవగాహనకు వచ్చింది. ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేసినా.. ఉప సంహరణ నాటికి ఎవరు ఏ వార్డులో పోటీ చేయాలన్న దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. బీజేపీ, జనసేనలతో పొత్తు ఖరారు కావడంతో.. ఇంకా బలం పెంచుకునేందుకు టీడీపీ.. సీపీఎంను కూడా ఆహ్వానిస్తోంది.

నెల్లూరులో సీపీఎంతో చర్చలు జరుపుతూ.. జనసేన, బీజేపీలను ఆహ్వానిస్తున్న టీడీపీ, ఆకివీడులో మాత్రం అందుకు భిన్నంగా సీపీఎంను పొత్తు కోసం పిలుస్తోంది. ఇలా ఎక్కడికక్కడ పొత్తులు పెట్టుకుంటున్న టీడీపీ ఆశలు ఫలిస్తాయా..? లేదా..? ఈనెల 17వ తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేలుతుంది.

Also Read : TDP BJP Alliance -బాబుతో పొత్తుకు బీజేపీ సిద్ధం అవుతుందా?

Show comments