Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వానికి తెరపడింది. నెల్లూరు కార్పొరేషన్ సహా బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు జిల్లా కుప్పం, అనంతపురం జిల్లా పెనుగొండ, కర్నూలు జిల్లా బేతంచర్ల, వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట, కమలాపురం, ప్రకాశం జిల్లా దర్శి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ల డివిజన్లకు ఈ నెల 15వ తేదీన పోలింగ్ జరగబోతోంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఒక్క రోజు విరామం తర్వాత 17వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.
హోరాహోరీ ప్రచారం..
ఈ ఏడాది మార్చిలో జరిగిన 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికల్లో అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 12 కార్పొరేషన్లను, 74 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలను బంపర్ మెజారిటీతో గెలుచుకుంది. టీడీపీ కేవలం అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని సాధారణ మెజారిటీతో గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ శర్వశక్తులు ఒడ్డినా.. అత్యంత ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రతి మున్సిపాలిటీకి ఇన్చార్జులను నియమించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ప్రతి రోజు వారితో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరో వైపు వైసీపీ దూకుడుగా ప్రజల్లోకి వెళుతోంది. జగన్ సర్కార్ పాలన, సంక్షేమ పథకాలు ఆ పార్టీ విజయానికి జోడు చక్రాలుగా పని చేస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలను తామే గెలుస్తామనే ధీమతో వైసీపీ నేతలున్నారు.
కుప్పంపైనే ఆసక్తి..
అన్ని చోట్లా వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. టీడీపీ.. కలిసి వచ్చిన చోట.. జనసేన, బీజేపీ, సీపీఎం పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీలో నిలుచుంది. నెల్లూరులో 8 డివిజన్లు, కుప్పం, దర్శిలలో ఒక్కొక్క వార్డు, గురజాలలో ఆరు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా అన్ని చోట్లా హోరాహోరీ పోటీ నెలకొంది. అయినా కుప్పం మినహా నెల్లూరు సహా ఇతర మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల ఫలితాలపై పెద్ద ఆసక్తిలేదు. అధికార పార్టీ సులువుగా ఆయా మున్సిపాలిటీలను కైవసం చే సుకుంటుందనే అంచనాలున్నాయి. ఒక్క కుప్పం ఫలితంపైనే అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో.. పాగా వేసేందుకు వైసీపీ, పట్టు నిలుపుకునేందుకు టీడీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తుది ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నెలకొంది.
Also Read : TDP, Chandrababu, Kuppam. Lokesh -కుప్పంలో అంత పట్టుఉంటే ఎందుకీ తిప్పలు?