మాగంటి… కనిపించరేంటి??

  • Published - 04:26 AM, Sat - 13 February 21
మాగంటి… కనిపించరేంటి??

పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు మాగంటి కుటుంబం హావా ఎక్కువ. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి జడ్పి చైర్మన్ గా, చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఇంటికి వెళుతూ మార్గమధ్యలోనే చనిపోయారు. రవీంద్రనాథ్ చౌదరి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య మాగంటి వరలక్ష్మి గెలిచి,మంత్రిగా కూడాపనిచేశారు.

గోదావరి రాజకీయాల్లో మాగంటి ఫ్యామిలీ కాంగ్రెస్కు తురుపు ముక్క అనేది చరిత్రే. మాగంటి దంపతుల రాజకీయ వారసత్వం తీసుకొని కాంగ్రెస్లోకి వచ్చిన మాగంటి బాబు(వెంకటేశ్వర రావ్ ) 1998 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా, 2004లో దెందులూరు నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మాగంటి బాబు మంత్రిగా కూడా చేశారు. 2007లో జరిగిన జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో దెందూలూరు మండలంలో కాంగ్రెస్ ఓడిపోవటంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవి పోయిందన్న కోపంతో కాంగ్రెస్ ను వీడి 2009 లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2014లో మాత్రం గెలిచారు. వైసీపీ సునామీలో 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.

2014లో హల్ చల్

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాగంటి బాబు ఏలూరు లోక్ సభ స్థానం నుంచి తోట చంద్రశేఖర్ ను ఓడించి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. టిడిపి సైతం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో జిల్లాలో మాగంటి బాబు కొన్నిరోజులు హల్ చల్ చేశారు. తమ సొంత ఊరు కైకలూరులో పోలీసులు ఓ పేకాట క్లబ్ మీద చేసిన దాడి విషయంలో మాగంటి బాబు కల్పించుకోవడం పెద్ద వివాదానికి దారి తీసింది. అధికారంలో ఉన్నప్పుడు జిల్లా టిడిపి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తూ, అన్ని తానై భుజానికి ఎత్తుకున్న ఆయన పేకాట క్లబ్ మీద పోలీసులు దాడి చేస్తే వారి మీదనే ఎదురు దాడికి పాల్పడటం తో టీడీపీ ప్రతిష్ట కొల్లేరు లో కొట్టుకుపోయింది.

పీతల సుజాతతో వైరం

మాగంటి బాబుకు,నాటి మంత్రి పీతల సుజాతతో వచ్చిన విబేధాలు తీవ్రస్థాయికి వెళ్లాయి. మాగంటి బాబు,చింతమనేని ప్రభాకర్ చేసిన రాజకీయం వలెనే తాను మంత్రిపదవి కోల్పోవలసి వచ్చిందని పీతలసుజాత ఆరోపించింది. పోరుగు నియోజకవర్గం చింతలపూడి ఎమ్మెల్యే సుజాతకు మంత్రిపదవి పొతే తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశపడిన నాటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ది అడియాశే అయ్యింది. బాబు,ప్రభాకర్ పట్టుదలతో పీతలసుజాతకు 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో టికెట్ దక్కిన బాబు,ప్రభాకర్ ఇద్దరు ఓడిపోయారు..

2019 ఎన్నికల్లో ఓడిపోయినా తరువాత మాగంటి బాబు రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ప్రస్తుతం స్థానికసంస్థల ఎన్నికలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. పంచాయతీ ఎన్నికల్లో కనీసం ఆయన దర్శనమే ఎవరికీ లభించడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో కనీసం ఆయన ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పర్యటన చేయలేదు. మాగంటి బాబు ఏలూరు రాజకీయాల్లోనే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపికి గట్టి నాయకుడిగా ఉంటారని భావించిన చంద్రబాబుకు నిరాశే ఎదురయ్యింది.

కైకలూరులోన? ఏలూరులో ఉంటారా?

మాగంటి కుటుంబం సొంత ఊరు కైకలూరు. మాగంటి బాబు దాదాపు అక్కడే ఉంటారు. పల్లె వాతావరణంలో ఉండడానికి ఇష్టపడే ఆయన ఏలూరుకు అప్పుడప్పుడూ వచ్చి వెళుతూ ఉంటారు. సొంత ఇల్లు ఏలూరులో ఉన్నప్పటికీ ఆయన కార్యకలాపాలన్నీ కైకలూరు వేదికగానే జరుగుతాయి. దీంతో టిడిపి కార్యకర్తలు అసలు ఆయన ఎక్కడ ఉంటారో తెలియక సతమతమవుతున్నారు. కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏలూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నియోజకవర్గాల్లో సైతం మాగంటి బాబు దృష్టి పెట్టింది లేదు. అసలు కనీసం ఆయన ఎక్కడ ఉన్నారో కూడా బయటకు రావడం లేదు. అప్పుడప్పుడూ చుట్టం చూపులా ఏలూరు కు వచ్చి పోతున్నారన్న వేదన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.

కొడుకుకు వదిలేశారా?

మాగంటి బాబు రాజకీయ వారసత్వాన్ని పెద్దకొడుకు రాంజీ కి అప్పగించినట్లు చెబుతున్నారు. అయితే ఓ మహిళ విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు జోరు మీద ఉన్న రాంజీ రాజకీయ ప్రయాణానికి బ్రేకులు వేసాయి. వచ్చే ఎన్నికల్లో మాగంటి బాబు కాకుండా మాగంటి రాంజీ తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగుతారని ప్రచారం మొదటి నుంచి ఉన్నా, మహిళ కు సంబంధించిన ఆరోపణలు వచ్చిన తర్వాత రాంజీ కూడా సైలెంట్ అయిపోయారు. మరోపక్క ఏలూరు లోక్సభ సీటును బోళ్ళ బులి రామయ్య మనవడు బోళ్ళ రాజీవ్ ఆశిస్తున్నారు. దీంతో ఈసారి మాగంటి కుటుంబానికిలోక్ సభ టికెట్ కేటాయించడం కూడా దాదాపు కష్టమే.

Show comments