Idream media
Idream media
ఈ ఏడాది ప్రారంభంలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు విరుద్ధం అంటూనే సెలెక్ట్ కమిటీకి పంపించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్‌ను తెలుగుదేశం పార్టీ కీలక పదవిలో కూర్చోబెట్టింది. పోలిట్‌బ్యూరోలో సభ్యుడుగా నియమిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే లో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడంతో మండలి చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన షరీఫ్.. అప్పటి నుంచి దాదాపు ఐదు నెలలుగా సైలెంట్‌గా ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు షరీఫ్ పేరు ఈ విధంగా వార్తల్లోకి ఎక్కింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన షరీఫ్ ఆది నుంచి ఒకే పార్టీలో ఉంటూ నిబద్ధతతో పని చేసిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన షరీఫ్.. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం. పార్టీ పదవులు, పార్టీ పనులకే ఆయన పరిమితమయ్యారు. ఆయన సేవలను గుర్తింపునిస్తూ.. ఎన్టీ రామారావు 1987లో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.
Also Read : Amalapuram Ex MLA – జెడ్పి పీఠంపై ఆశతో జెడ్పిటిసిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!
చంద్రబాబు చేతికి టీడీపీ వచ్చిన తర్వాత షరీఫ్‌కు మొదట్లో పెద్ద ప్రాధాన్యం దక్కలేదు. అయినా ఆయన పార్టీలోనే కొనసాగారు. డిగ్రీలో చిరంజీవి క్లాస్‌మేట్ అయిన షరీఫ్.. పీఆర్‌పీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగారు. 2009 సార్వత్రిక ఎన్నికలు, 2012 ఉప ఎన్నికల్లో నరసాపురంలో పోటీ చేస్తారని సాగిన ప్రచారం కార్యరూపం దాల్చలేదు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న షరీఫ్.. సుబ్బారాయుడు ఏ పార్టీలో ఉన్నా.. ఆయన గెలుపు కోసం పని చేసేవారని చెబుతుంటారు.
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో.. షరీఫ్‌కు తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం లభించింది. 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ముస్లిం నేతకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో.. ఆ పదవి దక్కే వారి జాబితాలో షరీఫ్ కూడా ఉన్నారు. అయితే అప్పటి మండలి చైర్మన్ ఫరూఖ్‌కు మంత్రి పదవి దక్కగా.. అప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న ఆయన రాజీనామా చేశారు. ఫరూఖ్ స్థానంలో ఎంఏ షరీఫ్‌కు మండలి చైర్మన్ అయ్యే అవకాశం లభించింది. చైర్మన్‌గా పని చేసిన కాలంలో.. రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో తప్పా.. మరే సందర్భంలోనూ షరీఫ్ విమర్శలు ఎదుర్కొలేదు. నిబంధనలకు విరుద్ధమైనా బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నాంటూ చెప్పిన ఆయన.. తప్పును ఒప్పుకుంటూనే సరిదిద్దుకోలేని తప్పును చేశారు.
Also Read : Tdp President – అచ్చెన్నాయుడు వార్నింగ్స్