మా పంచాయతీ ఎవరికి వస్తుంది..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే స్థానిక పోరు షురూ కానుంది. ఇందుకు సంబంధించిన పనులను పంచాయతీ రాజ్‌ శాఖ చేస్తోంది. ఇప్పటికే బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెలాఖరకు బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తికానుంది. మండలాలకు ఆర్‌వో, ఏఆర్‌వోలను నియామకం పూర్తయింది. ఇక రిజర్వేషన్ల ఖరారు కావాల్సి ఉంది.

ఏ సామాజికవర్గానికి వస్తుంది..?

పంచాయతీ, ఎంపీటీ ఎన్నికలకు సంబంధించిన పనులను చకచకా జరుగుతుండడంతో రిజర్వేషన్లపై ప్రస్తుతం గ్రామాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఎలా ఉంటాయోన్న ఉత్కంఠ ఆశానువాహుల్లో నెలకొంది. పోటీ చేసే వారితోపాటు ఓటర్లలోనూ రిజర్వేషన్ల అంశం ఆసక్తిని రేపుతోంది. తమ పంచాయతీకి సర్పంచ్‌ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవుతారన్నదానిపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.


రిజర్వేష్లన్లు బట్టీ అభ్యర్థులు..?

పంచాయతీ ఎన్నికలు స్వతంత్ర గుర్తులపై జరిగినా ఆయా పార్టీలదే ముఖ్య పాత్ర. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ ల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. రిజర్వేషన్లు ఖరారై ఏ సామాజికవర్గానికి వచ్చినా.. సర్పంచ్‌ అభ్యర్థులను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ.. ఇలా నాలుగు సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులను ఆయా పార్టీలు ఎంపిక చేస్తున్నాయి. రిజర్వేషన్లు ఖారైన తర్వాత ఏ సమాజిక వర్గానికి పంచాయతీ సర్పంచ్‌ సీటు ఖరారైతే వారిని అభ్యర్థిగా నిలబెట్టనున్నారు.


సర్పంచ్‌ కాకపోతే ఎంపీటీసీ..

గ్రామాల్లో బలంగా ఉన్న జనరల్‌ అభ్యర్థులు పంచాయతీ సర్పంచ్‌పై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నేతలు పంచాయతీ గిరిపై కన్నేశారు. పార్టీ అధికారంలోకి రావడం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడంతో ఈ సారి పంచాయతీ సర్పంచ్‌కు విశేష అధికారాలు రాబోతున్నాయి. అధికారాలతోపాటు, నిధులు దండిగా వచ్చే అవకాశం ఉండడంతో పంచాయతీని తమ హాయంలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అభ్యర్థులున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ సీటు రిజర్వ్‌ అయితే ఎంపీటీసీ అయినా జనరల్‌కు రావాలని కోరుకుంటున్నారు. సర్పంచ్‌ కాకపోతే ఎంపీటీసీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.


సిఫార్సులకు యత్నాలు..

రాష్ట్రంలో 17,363 గ్రామాలు ఉండగా, 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి రిజర్వ్‌ కానున్నాయి. మొత్తం పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ సీటు ఖరారవుతుందోన్న ఉత్కంఠ ఆశానువాహుల్లో నెలకొంది. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో తమకున్న పరిచయాల ద్వారా తమ పంచాయతీ తమ సామాజిక వర్గానికే వచ్చేలా పలువురు ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం, ఎంపీ, ఎమ్మెల్యేల గెలుపుకోసం తాము చేసిన పనిని ఏకరువు పెట్టి పంచాయతీ సీటు తమ సామాజిక వర్గానికి ఖారారు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.


ఏ పదవులు ఏ అధికారి రిజర్వ్‌ చేస్తారు..

స్థానిక సంస్థల పదవుల రిజర్వేషన్లు వివిధ స్థాయిల్లోని అధికారులు ఖరారు చేయనున్నారు.

 – పంచాయతీ వార్డులకు సంబంధించి రెవెన్యూ డివిజనల్‌ అధికారి(ఆర్‌డీవో), మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఖరారు చేస్తారు.

– సర్పంచి సీట్లపై పంచాయతీ రాజ్‌ కమిషనర్, కలెక్టర్, ఆర్డీవోలు నిర్ణయం తీసుకుంటారు.

– ఎంపీటీసీ సీట్లకు సంబంధించిన రిజర్వేషన్లు కలెక్టర్, ఆర్డీవోలు నిర్ణయించనున్నారు.

– మండల పరిషత్‌ అధ్యక్షుడు(ఎంపీపీ) సీటు రిజర్వేషన్‌ పంచాయతీ రాజ్‌ కమిషనర్, జిల్లా కలెక్టర్‌ ఖరారు చేస్తారు.

– జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యుడు(జెడ్పీటీసీ) సీట్ల రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్‌ నిర్ణయిస్తారు.

Show comments