Idream media
Idream media
మరో రెండేళ్లలోనో, లేదా అంతకంటే ముందుగానే.. తెలంగాణలో అధికార సంగ్రామం మొదలుకానుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఆ పార్టీకి తిరుగులేనట్లుగానే ఉండేవి.
అయితే, ఈ ఏడాది కాలంలో కాస్త మార్పు కనిపిస్తోంది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. ఎప్పుడైతే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిందో అప్పటి నుంచీ బీజేపీ నేతలు వాయిస్ పెంచారు. అలాగే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ కూడా ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేస్తోంది. మరోవైపు బీఎస్పీలో చేరిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, కొత్తగా పురుడుపోసుకున్న వైఎస్ ఆర్ టీపీ అధినేత్రి షర్మిల కూడా కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయం బాగా వేడెక్కింది.
ఈ క్రమంలో అధికార పార్టీ కూడా అప్రమత్తమైంది. ప్రజల్లోకి దూసుకెళ్తూ కేసీఆర్ ఆకర్షిస్తుంటే.. టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కె. తారక రామారావు ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాల్లో దూకుడు పెంచారు. అలాగే.. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలోనూ అదే తీరు అవలంబిస్తున్నారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ పైనా ఎవరైనా అవాకులు చవాకులు వాగితే గట్టిగానే బదులు ఇవ్వాలని తాజాగా పార్టీ శ్రేణులకు సూచించారు. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రత్యర్థి పార్టీలకు దీటైన సమాధానం ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఇదే దిశగా మరింత వేగంగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ పార్టీ శ్రేణులతో సమావేశంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Also Read:భూముల అమ్మకంలో భారీ కుంభకోణం?.. కేసీఆర్ పై సీబీఐకి ఫిర్యాదు..!
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో మరే పార్టీలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సరైన ప్రతిపక్ష నాయకుడు లేకుండా చూసుకోవడంలో సఫలమయ్యారు. ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నాయకులకు టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ తనకు ఎదరులేకుండా చేసుకున్నారు. తెలుగుదేశం పూర్తిగా కనుమరుగు కాగా, కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా గట్టిగా తమ స్వరాన్ని వినిపించలేకపోయారు. కానీ ఏడాది కాలంగా రాష్ట్రంలో పరిస్థితి మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన బండి సంజయ్ దూకుడుతో కేసీఆర్ కు ఎదురు నిలుస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా సాగుతున్నారు. ఇక ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ వేడి ఇంకాస్త పెరిగింది. అధికార పార్టీని వీడి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని ఉప ఎన్నికలో విజయం కోసం శాయాశక్తులా ప్రయత్నిస్తున్న ఈటల రాజేందర్ ఒకవైపు, మరోవైపు నుంచి గులాబీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో పాటు మిగతా పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలు కూడా సైలెంట్ గా ఉండాల్సిన అసవరం లేదని ప్రత్యర్థి పార్టీ నాయకుల మాటలకు తగిన రీతిలో సమాధానం ఇవ్వాలని కేటీఆర్ తాజాగా తమ నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఇటీవల రేవంత్ రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలకు టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నోటికొచ్చినొట్లు రేవంత్పై మాటల దాడి చేసిన మల్లారెడ్డి.. దమ్ముంటే రేవంత్ రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని తొడగొట్టి మరీ సవాలు చేశారు.
Also Read: కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ.. గవర్నర్ ఆమోద ముద్ర వేసేనా?
మల్లారెడ్డి వ్యాఖ్యలను అప్పుడు కేటీఆర్ కూడా వెనకేసుకొచ్చారు. ప్రత్యర్ఙి పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటూ చూస్తూ కూర్చోవాలా? మల్లారెడ్డి ఎప్పుడూ జోష్లో ఉంటారు కాబట్టి అలా మట్లాడారని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు తాజా సమావేశంలోనూ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రత్యర్థి పార్టీలు కేసీఆర్ లాంటి ఎంతో అనుభవం ఉన్న నాయకుడిని నానా మాటలు అంటుంటే మనం తగ్గాల్సిన అవసరం లేదని ఊరుకోకుండా ఉండకూడదని మాటలతో సమాధానం ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ విస్తృత స్థాయి కమిటీలు వేస్తున్నారు. ఇవి పూర్తయితే తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.