Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గంజాయి రాజకీయం సాగిస్తూనే ఉంది. సోమవారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. రాష్ట్రంలో 24 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని, అది 8 వేల కోట్ల రూపాయలు ఉంటుందని విలువ కూడా కట్టేశారు. గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ గౌతం సవాంగ్ రాజమహేంద్రవరంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తే,అదే సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గంజాయిపై తన అనుభవాన్ని అంతా రంగరించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ రోజు బుధవారం గంజాయిపై మాట్లాడే బాధ్యతను టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీసుకున్నారు.
టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గంజాయి సాగు చేస్తున్నట్లు, దాన్ని ప్రభుత్వమే ప్రొత్సహిస్తున్నట్లుగా ఉంది. అంతకు ముందు తాము అధికారంలో ఉన్నప్పుడు గంజాయి అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. గంజాయి వ్యవహారాన్ని గణాంక సహితంగా మంగళవారం డీజీపీ గౌతం సవాంగ్ వివరించారు. ఆ గణాంకాలతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో సహా గంజాయిపై మాట్లాడిన, మాట్లాడబోతున్న నేతలు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అబ్కారీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేఎస్ జవహర్ గంజాయిపై చెప్పిన ఓ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
2018లో రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నాటి మంత్రి కేఎస్ జవహర్ నూతనంగా తెచ్చిన మద్యం విధానం, పర్మిట్ రూములు విశాలంగా ఏర్పాటు చేయడం వంటి విషయాలపై మాట్లాడారు. సారా నియంత్రణకు, బెల్ట్ షాపుల నివారణకు, గంజాయి సాగును అరికట్టేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఏకరువు పెడుతూ.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో గంజాయి సాగు చేస్తున్నారంటూ మాట్లాడారు. మంత్రినే ఏకంగా ఇలా మాట్లాడడంతో ఆయన పక్కనే ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితోపాటు మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఒక్కక్షణం జవహర్ ప్రతిపక్ష పార్టీ నేతనా..? అనే సందేహం కూడా అక్కడి వారిలో వచ్చింది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచే మంత్రి ఈ ఆరోపణలు చేశారు. పాలన సాగిస్తుంది టీడీపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో జవహర్ ఎక్సైజ్ శాఖ మంత్రి. అంతటి కీలకమైన బాధ్యతలో ఉన్న వ్యక్తి,ఏకంగా సెంట్రల్ జైలులోనే గంజాయి సాగు చేస్తున్నారంటూ మాట్లాడారు. మంత్రిగా ఉన్న జవహర్‌కు పక్కా సమాచారం లేకుండా అలా తోచింది మాట్లాడరు. సెంట్రల్ జైలులో గంజాయి సాగు చేస్తున్నారంటూ మాట్లాడిన మంత్రి,మళ్లీ అక్కడ తనికీ చేయకపోవడం విశేషం. టీడీపీ ప్రభుత్వంలో సెంట్రల్ జైలులోనే గంజాయి సాగు చేస్తే మరి ఇతర ప్రాంతాలలో పరిస్థితి ఏమిటి? మరి నాడు మంత్రి హోదాలో జవహర్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం గంజాయిపై హంగామా చేస్తున్న టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో..?