Idream media
Idream media
రాష్ట్ర విభజన అనంతరం దాదాపు ఏడేళ్ల తర్వాత కృష్ణ, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ అమలుకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 14వ తేదీ నుంచి రెండు నదుల పరిధిలోని ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి రాబోతున్నాయి. గెజిట్ ప్రకటించిన మూడు నెలల తర్వాత.. నిర్వహణ, నియంత్రణ అంతా రెండు నదుల యాజమాన్య బోర్డుల పరిధిలోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది.
దీంతో గెజిట్ అమలుకు మరో మూడు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో.. బోర్డుల అధికారులు ఇప్పటికే కసరత్తులు పూర్తి చేశారు. నదులపై ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి..? ఆయా ప్రాజెక్టుల పరిధిలో వివాదాలు లేని కేంద్రాలు ఏవి..? అభ్యంతరాలు ఉన్నవి ఏవి..? అనే అంశాలపై ఓ నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలపై రెండు నదుల గెజిట్ అమలుపై ఏర్పాటు చేసిన ఉప సంఘాలు ఆదివారం సమావేశమై చర్చిస్తున్నాయి. అయితే ఈ నెల 12వ తేదీన జరిగే బోర్డుల సమావేశంలో ఆ నివేదికలపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెబుతాయనేదే ఆసక్తికరమైన అంశం.
కృష్ణా ప్రాజెక్టులపైనే పేచీ అంతా..
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధానంగా కృష్ణా నది ప్రాజెక్టులపైనే వివాదం నెలకొని ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని ప్రాజెక్టులపై అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లోని 12 ప్రాజెక్టులు, వాటి పరిధిలోని 65 కేంద్రాలను గెజిట్‌లోని రెండో షెడ్యూల్‌లో చేర్చారు. ఇందులో రెండు అసలు లేకపోగా, రెండు పునరుక్తి అయ్యాయి. మరొకటి కర్ణాటకలో ఉంది. ఇవి పోగా మిగిలిన 60 కేంద్రాలలో 50 మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 21 ఏపీ పరిధిలోనూ, 22 తెలంగాణ పరిధిలోనూ ఉండగా.. మిగిలిన ఏడు ఉమ్మడి ప్రాంతంలో ఉన్నాయి.
Also Read : మాజీమంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు?
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ 50 కేంద్రాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు అప్పగించాల్సి ఉండగా.. ఇందులో పలు ప్రాజెక్టులపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాశాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు తెలపని కేంద్రాలు 29 ఉన్నాయి. మొదటి దశలో అభ్యంతరాలు లేని కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఉప సంఘం యోచిస్తోంది. అభ్యంతరాలు ఉన్న ప్రాజెక్టులపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
వెంటనే బోర్డు పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులు..
శ్రీశైలం ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఆరు కేంద్రాలు, తెలంగాణ పరిధిలోని రెండు కేంద్రాలు బోర్డుల పరిధిలోకి వెంటనే వచ్చే అవకాశం ఉంది. ఏపీలోని శ్రీశైలం స్పిల్ వే, కుడి గట్టు విద్యుత్తు కేంద్రం, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ఎత్తిపోతల పంప్ హౌస్, ముచ్చుమర్రి పంపు హౌస్‌లు, తెలంగాణలోని ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంప్ హౌస్‌లు ఈ నెల 14వ తేదీన బోర్డు పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : కోనసీమ లో 186 ఏళ్లుగా జరుగుతున్న చెడీతాలింఖానా గురించి తెలుసా..?
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలవలు, ప్రధాన విద్యుత్తు హౌస్, ఎడమ కాలువ కింద పలు పాయింట్లు, ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్‌లు ఉన్నాయి. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ కింద హెడ్ వర్స్, విద్యుత్ బ్లాక్‌లు మొదటి దశలో బోర్టు పరిధిలోకి రాబోతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు కింద హెడ్‌వర్క్స్, విద్యుత్ బ్లాక్, కేసీ కాలువ కింద సుంకేశుల, ఆర్డీఎస్ కింద క్రాస్ రెగ్యులేటర్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి.
రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలుపుతున్న ప్రాజెక్టులు..
నిర్వహణలో ఉన్న. ఇంకా నిర్వహణలోకి రాని పలు ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి అవసరం లేదని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేశాయని ఉప సంఘం తన నివేదికలో పేర్కొంది. జురాల, నెట్టంపాడు, భీమా, ఎస్‌ఎస్‌బీసీ, పాలమూరు–రంగారెడ్డి, దిండి, హైదరాబాద్ తాగునీటి సరఫరా, భక్తరామదాసు, పాలేరు రిజర్వాయర్, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తీసుకువచ్చే ఆరు పాయింట్లపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
బనకచర్ల రెగ్యులేటర్, నిప్పులవాగు, ఎస్సార్బీసీ–అవుకు, వెలిగోడు, తెలుగుగంగ లింకు కాలువ, వెలిగొండ, గాలేరి–నగరి, తుంగభద్ర ఎల్లెల్సీ, హెచ్చెల్సీ, మునియేరు నీటి మళ్లింపు, గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని మళ్లించే పట్టిసీమ ఎత్తిపోతల పథకం, కృష్ణా డెల్టా, గుంటూరు ఛానెల్‌పై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు తెలిపింది. రెండు రాష్ట్రాలు ఈ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాల్సిన అసవరం లేదని చెబుతున్నాయి. ఈ నెల 12వ తేదీన జరగబోయే బోర్డుల సమావేశం అనంతరం ఈ అంశాలపై స్పష్టత రానుంది.
Also Read : ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రభుత్వాలు ఎందుకు నోట్లను ముద్రించవో తెలుసా..?