TRS, KCR, BJP – జాగ్రత పడుతున్న కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పరిపాలన విషయంలో అదేవిధంగా మంత్రుల పనితీరు విషయంలో ఎక్కువగా ఫోకస్ పెట్టారని ప్రచారం ఊపందుకుంది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఏ ఒక్క విషయంలో కూడా అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని కొన్ని విషయాల్లో గతంలో కఠినంగా ఉండే ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కాస్త వెనుకడుగు వేశారనే ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు మాత్రం సామాజికవర్గాల లెక్కలు చూస్తూనే కొంతమంది పనిచేయని వారిని పక్కన పెట్టేందుకు ఆయన రెడీ అవుతున్నారని, ఏ సామాజికవర్గం అయినా సరే పనిచేయని వారిని పక్కన పెట్టి, అదే సామాజిక వర్గానికి చెందిన మరో సమర్థమైన నాయకుడిని పార్టీలో అలాగే ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చి ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా సరే భారతీయ జనతా పార్టీ దాన్ని భూతద్దంలో పెట్టి మీడియాలో హైలెట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే కీలక శాఖల మంత్రులు మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

హుజురాబాద్ ఎన్నికల్లో పరోక్షంగా ఓటమికి కారణమైన ఒక మంత్రి గారిని పక్కన పెట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని సమాచారం. అదే విధంగా ఉత్తర తెలంగాణ కు చెందిన ఇద్దరు మంత్రులను సీఎం కేసీఆర్ పక్కన పెట్టేందుకు ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారు చేశారనేది రాజకీయ వర్గాలు చేస్తున్న కామెంట్. ప్రతి శాఖ మీద సీఎం కేసీఆర్ ఒక కన్నేసి ఉంచారని, మంత్రుల ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నారనే దానిపై కూడా ఆయన నివేదికలు తెప్పించుకుని త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Also Read : BJP, Petrol Prices – కొనక్కొచ్చుకున్న బీజేపీ..!

జనవరి మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. నల్గొండ జిల్లాకు సంబంధించి ఇద్దరు క్యాబినెట్ లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. త్వరలో శాసన మండలికి వెళ్లబోయే గుత్తా సుఖేందర్రెడ్డి ,అలాగే బొల్ల మల్లయ్య యాదవ్… ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లను సీఎం కేసీఆర్ క్యాబినెట్ లోకి ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. వారితో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ని కూడా కేబినెట్లో తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

పని చేయని వారికి సంబంధించి ఇప్పటికే నివేదికలను వాళ్ళకు సీఎం పేషీ నుంచి పంపించారని, అధికారులకు అందుబాటులో ఉండని వాళ్ళను, వ్యాపారాల మీద దృష్టి పెట్టి ఇతర ప్రాంతాల్లో సమయం గడిపే వాళ్ళను, ప్రతిపక్షాల మీద విమర్శలు చేయని వారిని, అలాగే పార్టీలో గ్రూపులను ప్రోత్సహించే వారిని సీఎం కేసీఆర్ ఎక్కువగా టార్గెట్ చేశారని టాక్ నడుస్తోంది. అలాగే ఎమ్మెల్యే లకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యేలు ఉన్నా సరే నియోజకవర్గాల బాధ్యతలు మరో నేతకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారట.

ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మూడు నియోజకవర్గాల్లో సంచలన మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ జిల్లాలో ఇటీవలి కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు వివాదాలను, గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని సీఎం కేసీఆర్ కు సమాచారం అందింది. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మంత్రులను, ఎమ్మెల్యేలను జాగ్రత్తగా ఉండాలి అనే సంకేతాలను కూడా సీఎం కేసీఆర్ పంపించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Also Read : KCR Press Meet – ధాన్యం కొనుగోలు, పెట్రోల్‌ ధరలు.. కేంద్రాన్ని ఉతికి ఆరేసిన కేసీఆర్

Show comments