Idream media
Idream media
“పోలీసు యంత్రాంగం మొత్తం ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతోంది. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రతీ ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాం..” వంటి హెచ్చరికలు, “అన్యాయంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు..” వంటి ఆరోపణలు, “ఏమనుకుంటున్నావో.. నీ ఆంతు చూస్తా” అని సీఐపై నోరు పారేసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. పలు కేసుల్లో కూడా ఇరుక్కున్నారు. ఎప్పుడూ నోరు జారుతూ ఏదో వివాదంలోనో, కేసులోనో ఇరుక్కునే జేసీ తాజాగా చేసిన వ్యాఖలు ఆసక్తికరంగా మారాయి. ఈ మార్పు వెనుక వ్యూహం ఏంటి అని కొందరు అనుమానిస్తుండగా, టీడీపీ నేతలకు మాత్రం బుర్రపాడైపోతోంది. ఇంతకీ జేసీ ఏమన్నారంటే..
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు బుధవారం జరిగాయి. ఎన్నికల్లో పోలీసుల వ్యవహారశైలిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“ఈ రోజు నా నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. పోలీసులకు హ్యాట్సాప్ చెబుతున్నాను. అసలు ఇలా (నిష్పక్షపాతంగా) ఎన్నికలు జరుపుతారని ఊహించలేదు. బ్రహ్మాండంగా చేశారు. ఈ మాటకు తిరుగులేదు. ఎస్పీ గారు ఇక్కడే (తాడిపత్రి) ఉండి, ప్రత్యేకంగా డీఎస్పీ, తాలూకా సీఐ బ్రహ్మాండంగా పని చేశారు. ఇప్పుడు గెలుపోటముల గురించి పెద్దగా పట్టింపు లేదు. గెలిచినా , ఓడినా ఇదే సంతోషమే. ఇన్ని రోజులు దగ్గరదగ్గర 20 నెలలుగా ప్రతి ఒక్కరూ పోలీసుల్ని ఏదో ఒక మాట అంటున్నారు.
కానీ నేను ఒప్పుకోను. బ్రహ్మాండంగా చేశారు. పోలీస్ అనిపించారు. నేను కోరేది ఒక్కటే మున్ముందు కూడా ఇట్లే చేయాలి. పవర్‌లో ఉన్న తర్వాత కొన్ని మినహాయింపులు ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్లకు 60%, ప్రతిపక్షాలకు 40 % అనుకూలంగా చేయడం వల్ల మంచి పేరు వచ్చింది. నాకు ఎవరన్నా ఏమన్నా అనుకోని. నిజం ఒప్పుకోవాల్సిందే. మేము గెలిచినా, ఓడినా సంబంధం లేదు. ఎవరి మీద నిందలు వేయం. పోలీసులకు వందనాలు. తలవంచి నమస్కారం చేస్తున్నా. ఎవరినీ లెక్కచేయలేదు. టీడీపీ, వైసీపీ, స్వతంత్ర అభ్యర్థి అనేది లేదు. ఇంత బాగా ఎప్పుడూ పని చేయలేదు. నిజంగా నేను హృదయ పూర్వకంగా చెబుతున్నా. మెహర్బానీ కోసం మాట్లాడ్డం లేదు. రియల్లీ హ్యాట్సాప్ టు పోలీస్ సర్. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఉద్యోగి బాగా పనిచేశారు. ఇలాగే పని చేయండి. ప్రజలకు అండ మీరే. అది కూడా లేకపోతే కోర్టులే అండ. ప్రెస్‌కు కూడా ఒకటి చెబుతున్నా…నిజాల్ని చెప్పాలి” అని మీడియాతో అన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ బాబు మొదలుకుని టీడీపీ గల్లీ లీడర్ వరకూ పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో …. అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.జేసీ ప్రభకర్ రెడ్డి మీద పలు కేసులు నమోదు కావటం,ఆ సందర్భంగా ఆయన ఊగిపోతూ పోలీసులను నానామాటలు అనటం తెలిసిందే.అలాంటి జేసీ లో పోలీసులపట్ల ఇంతా మార్పా అంటూ ప్రజలు ఆశర్య పోతున్నారు.