iDreamPost
iDreamPost
ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా క్యాబినెట్ ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆయన అనూహ్యంగా స్పందించారు. మంత్రులకు దానికి తగ్గట్టుగా దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గంలోకి అవకాశం దక్కిన వారందరికీ రెండున్నరేళ్ల గడువు విధించారు. పనితీరు సంతృప్తికరంగా లేని వారందరినీ సాగనంపడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే అనూహ్యంగా మారిన పరిస్థితుల్లో ఆయన తాజాగా క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.
అయితే క్యాబినెట్ విషయంలో ఎలా ఉన్నప్పటికీ రెండున్నరేళ్ల పాలసీని స్థానిక ఎన్నికల్లో వర్తింపజేయాలని జగన్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. కీలకమైన కొన్ని జిల్లా పరిషత్, మేయర్ స్థానాలకు గట్టి పోటీ కనిపిస్తోంది. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అనివార్యంగా ఇలాంటి షరుతు విధించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు నెల్లూరు జెడ్పీ పీఠంపై ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కానీ రాజ్యసభ సభ్యుడు , వైసీపీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య బరిలో ఉన్నారు. ఆమెతో పాటుగా సీనియర్ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి కుమార్తె కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు అలాంటి సమయంలో అందరినీ సంతృప్తి పరిచే లక్ష్యంతో రెండున్నరేళ్ల పదవీకాలం చొప్పున పంపకాలకు జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు కనిపిస్తోంది.
వాస్తవానికి స్థానిక ఎన్నికల్లో ఈ రీతిలో పదవులు పంచడం ఈనాటిది కాదు. గతం నుంచీ వస్తున్నదే. అయితే ఇప్పుడు జగన్ రాష్ట్రం మొత్తం అందరికీ వర్తింపజేసే ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. తద్వారా ఆయా పదవుల్లో ఉన్న నేతలతో సమర్థవంతంగా పనిచేయించాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత ఉన్నారనే వాదన చేస్తున్నారు. విశాఖ మేయర్ పీఠం కోసం కూడా అప్పుడే కుస్తీ మొదలయ్యింది. వంశీకృష్ణ శ్రీనివాస్ పేరు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ ఇతరులు కూడా పోటీ పడుతుండడంతో ఇలాంటి పంపకాలు చేపట్టక తప్పదని భావిస్తున్నారు. దాంతో ఒకరిద్దరు నేతలకు కాకుండా అందరికీ అదే కండీషన్ అప్లై చేయడం ద్వారా జగన్ కీలకమైన నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం నాలుగేళ్ల పదవీ కాలం ముగిసేవరకూ అవిశ్వాసానికి అవకాశం లేదు. గతంలో వైఎస్సాఆర్ కాలంలో దానిని పొడిగించారు. అయితే జగన్ మాత్రం రెండున్నరేళ్ల షరతు విధించడం ద్వారా నేతలందరినీ కట్టడి చేసే యోచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది.