ప‌ట్టు బిగిస్తున్న జ‌గ‌న్.. క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రణాళిక

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చి సుమారు రెండున్న‌రేళ్లు అవుతోంది. ఈ కాలంలో ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. ల‌క్ష‌లాది కుటుంబాల‌కు ప్ర‌యోజ‌నం చేకూరేలా చేశారు. ప్ర‌జ‌లు, ప‌థ‌కాల కోస‌మే అధిక స‌మ‌యం కేటాయిస్తూ వ‌చ్చిన జ‌గ‌న్.. త‌న పాల‌న‌పై తానే స‌మీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే త్వ‌ర‌లో ప్ర‌జాక్షేత్రంలో ప‌ర్య‌ట‌న‌ల‌కు రెడీ అవుతున్న ఆయ‌న అంత‌కు ముందే.. ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను పిలిపించుకుని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప‌రిస్థితుల‌పై ఆరా తీస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాక ముందు నాటి ప‌రిస్థితులు, రెండున్న‌రేళ్ల కాలంలో జ‌రిగిన మార్పుల‌పై వివ‌రాలు తెలుసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

స‌చివాల‌యాల ప‌నితీరు ఎలా ఉందో స్వ‌యంగా వెళ్లి ప‌రిశీలించాల‌ని తొలుత మంత్రుల‌కు జ‌గ‌న్ ఆదేశించారు. ఈ మేర‌కు కొంద‌రు ప‌ర్య‌ట‌న‌లు కూడా చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఆయా స‌చివాల‌యాల‌ను సంద‌ర్శించాల‌ని సీఎం పేర్కొన‌డంతో వాళ్లు కూడా వాటిపై దృష్టి సారిస్తున్నారు. డిసెంబ‌ర్ నుంచి నేరుగా జ‌గ‌నే ప‌ర్య‌ట‌న‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారు. అంత‌కు ముందు ప్ర‌జాప్ర‌తినిధుల‌తో భేటీ అవుతున్నారు. రెండు, మూడు రోజులుగా పార్టీకి చెందిన ఎంపీల‌తో జ‌గ‌న్ అభివృద్ధి ప‌నుల‌పై చ‌ర్చిస్తున్నారు. రోజుకు ఐదుగురు ఎంపీలతో జగన్ భేటీ అవుతున్నట్టు సమాచారం. ఈ లెక్కన.. ఐదు రోజుల పాటు జగన్ ఎంపీలతో సమావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read : బద్వేలు ఉప ఎన్నిక : టీడీపీలో ఆశలు రేపుతున్న గోపవరం మండలం

ప్రజలకిచ్చిన హామీల అమల్లో నాన్చుడు లేదు.. మీన మేషాలు లెక్కించడం అసలే లేదు.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోంద‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. నవరత్నాల్లో ప్రజలకిచ్చిన హామీల్లో94 శాతం మేర అమలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ గ్రామ స్వరాజ్యానికి బాట‌లు వేశారు. గ్రామ సచివాలయాల్లో 500పైగా పౌరసేవలతో దేశంలోనే సరికొత్త విప్ల‌వం ఏపీలో కొన‌సాగుతోంది.

సూర్యోదయానికి ముందే 2.7 లక్షల మంది వ‌లంటీర్లు ప్ర‌తినెలా ఇంటింటికీ వెళ్లి ల‌బ్ధిదారుల‌కు పింఛ‌న్లు పంపిణీ చేస్తున్నారు. ‘నాడు-నేడు’ ద్వారా పాఠ‌శాల‌ల రూపురేఖ‌లు మార్చేశారు. అక్కాచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్లపట్టాలు అంద‌జేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత వంటి ఎన్నో ప‌థ‌కాలు ఏపీలో అమ‌ల‌వుతున్నాయి.

ఆయా ప‌థ‌కాలు అమ‌లు తీరుతెన్నుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌రుపుతున్న జ‌గ‌న్ ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. వాటిని ప‌రిశీలించి మిగిలిన అర్ధ‌భాగం పాల‌న‌ను మ‌రింత జ‌న‌రంజ‌కంగా సాగించేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో పాల‌నాప‌రంగా మున్ముందు ఇంకెన్ని అద్భుతాలు జ‌ర‌గ‌నున్నాయో వేచి చూడాల్సిందే.

Also Read : బద్వేలు ఉప ఎన్నిక – పెద్దిరెడ్డి సారథ్యంలో వైసీపీ టీం ఇదే..

Show comments