iDreamPost
iDreamPost
ఏపీ ప్రభుత్వం వ్యూహత్మకంగా ముందుకు సాగుతోంది. మొదటి దశలో జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందరినీ ఆకర్షించాయి. కేంద్రంతో పాటుగా పలు విదేశీ సంస్థలు కూడా ఏపీలో కోవిడ్ నియంత్రణ చర్యలను అభినందించాయి. ఇక ప్రస్తుతం రెండోసారి కరోనా కలకలం మొదలయిన నేపథ్యంలో కూడా అదే పంథాలో సాగుతోంది. పగడ్బందీగా ముందుకెళ్లే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది
గతంలో లాక్ డౌన్ మూలంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు తప్ప మరో గత్యంతరం లేని దుస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో సంపూర్ణ లాక్ డౌన్ కాకుండా పరిస్థితిని చక్కదిద్దాలనే లక్ష్యంతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఉదాహరణకు గత ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. దాంతో ఇప్పుడా బ్యాచ్ ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నారు. ఇప్పుడు కూడా వారికి పరీక్షలు పెట్టకుండా రద్దు చేస్తే వరుసగా రెండేళ్ళ పాటు కీలక దశలో వారికి ఎటువంటి పరీక్షలు లేకుండా పాస్ చేసినట్టవుతుంది. ఆ తర్వాత వారు తదుపరి ఉద్యోగ, ఇతర అంశాల్లో దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి కొంత కష్టమే అయినప్పటికీ ఆలోచన చేస్తూ పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది.
గత ఏడాది కూడా కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఇంటర్ పరీక్షలను పూర్తి చేశారు. ఈసారి కూడా ఎటువంటి సమస్య రాకుండా పూర్తి జాగ్రత్తలతో పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపుతున్నారు. ఇక లాక్ డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు కాకుండా వీలయినంత వరకూ నియంత్రణ చేసేలా సమయం తగ్గించడం, ఎక్కువ మంది గుమికూడా అవకాశం లేకుండా చేయడం, ప్రధాన అంగళ్లలో అన్ని జాగ్రత్తలు పాటించేలా చేయడం వంటి ఆలోచన చేస్తోంది.
అదే సమయంలో కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించే బాధ్యతను మరోసారి సీనియర్ అధికారి కే ఎస్ జవహార్ రెడ్డికి అప్పగించింది. గత ఏడాది కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లారు. ప్రస్తుతం టీటీడీలో ఉన్న ఆయన్ని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి, మరోసారి బాధ్యతలు అప్పగించడం కీలక నిర్ణయంగా భావించాలి. అంతేగాకుండా సీనియర్ మంత్రులతో ఓ కమిటీ ని ఏర్పాటు చేసి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. తద్వారా ఏపీ ప్రభుత్వం పూర్తి ప్రణాళికతో ముందకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రజలను ఆందోళనకు గురి చేయడం కాకుండా వారిలో అవగాహన పెంచుతూ కరోనా నియంత్రణకు మొగ్గు చూపుతున్నట్టు చెప్పవచ్చు.