వంగ‌వీటి.. ప‌వ‌న్ తో జ‌త క‌ట్ట‌నున్నారా?

మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో వంగ‌వీటి రంగా త‌న‌యుడు రాధా కొద్ది రోజుల క్రితం సమావేశం అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇద్దరూ ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. దీంతో రాధా మ‌ళ్లీ వైసీపీ వైపు అడుగులు వేయ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అంత‌లోనే.. ఇటీవ‌ల రాధా ఖమ్మం జిల్లా టూర్లో చేసిన వ్యాఖ్య‌లు ప‌రిశీలిస్తే.. మ‌ళ్లీ రూటు మార్చార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. వైసీపీ మంత్రి పేర్ని నానిని ప‌రోక్షంగా విమ‌ర్శిస్తూ.. ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా నిలిచార‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

రాజ‌కీయంగా రాధా ఆది నుంచీ త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నార‌న్న పేరు ఉంది. ఈ నేప‌థ్యంలో తాజా ప్ర‌స్థానం ఎటు దారి తీయ‌నుందో అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. జగన్ ను ఓడించాలి అనేది.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ల ప్ర‌ధాన టార్గెట్. దాని కోసం మ‌త రాజ‌కీయాలు చేశారు. పండ‌లేదు. ఏపీలో మత రాజకీయాలకు పెద్దగా ఓట్లు కూడా రాలవు. అది ఎన్నో సార్లు రుజువు అయింది. మరి మతం కంటే బలమైనది ఏంటి అంటే కులం. దాన్ని ప్రయోగించి ఏపీ పాలిటిక్స్ ను మార్చాల‌నే ప్ర‌య‌త్నాలు జోరుగా జ‌రుగుతున్న‌ట్లు తాజా స‌మీక‌ర‌ణాల ద్వారా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కుల ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాలు చేసేందుకు ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాయి. కానీ.. జ‌గ‌న్ సామాజిక న్యాయం పాటిస్తూ.. అంద‌రికీ అన్నింట్లోనూ స‌మ ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న పేరు పొందారు. ఆయ‌న చేస్తున్న కార్య‌క్ర‌మాలు, తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలో కాస్త గ‌ట్టిగా ప‌ట్టు బిగిస్తే త‌ప్పా త‌మ ప‌ప్పులుడ‌క‌లు అని ప్ర‌తిప‌క్ష పార్టీలు భావిస్తున్నారు.

ఏపీలో బలమైన సామాజిక వ‌ర్గమైన కాపు కుల‌స్తుల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ప‌వ‌న్ అదే సామాజిక వ‌ర్గానికి చెందిన‌వాడు అయిన‌ప్ప‌టికీ మొద‌టి నుంచి వారిని అంత‌గా ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు క‌నిపించ లేదు. అనూహ్యంగా ప‌వ‌న్ కూడా తాజాగా వారిని ఆక‌ట్టుకునేలా మాట్లాడుతున్నారు. ఏపీలో రాజ్యాధికారం కోసం కాపులు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. వారు ఆ దిశగా గతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ ఈసారి మాత్రం గట్టి పట్టుదల మీదనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రీ సభలో బహిరంగంగానే కాపులకు అప్పీల్ చేశారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని కూడా ఆయన గట్టిగా కోరుకున్నారు. ఆ దిశ‌గా రాజ‌కీయాలు ప్రారంభించిన‌ట్లు కూడా క‌నిపిస్తోంది.

పవన్ ఇచ్చిన పిలుపునకు కొంద‌రు కాపు పెద్దలు స్పందించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. రాజకీయ కురు వృద్ధుడు అనతగిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కూడా పవన్ మంచి మాట అన్నారని కీర్తించారు. కాపులు అంతా ఒక్కటిగా వచ్చే ఎన్నికల నాటికి ఉండాలని పిలుపు ఇచ్చారు. ఇపుడు అదే వరసలో మరో నేత మాట్లాడారు. ఆయన ఎవరో కాదు కాపులకు ఆరాధ్య దైవంగా ఉన్న వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధా. రాధా ఖమ్మం జిల్లా టూర్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆయన కాపులంతా ఒక్కటి కావాలని నినదించారు. తన తండ్రి కాపుల కోసం ఎంతో చేశారని వారి అభ్యున్నతి కోరుకున్నారని కూడా రాధా చెప్పుకొచ్చారు. కాపులు ఎందులోనూ తక్కువ వారు కారని ఆయన అన్నారు.

మరో వైపు మంత్రి పేర్ని నాని కామెంట్స్ ని కూడా ఇండైరెక్ట్ గా రాధా తప్పు పట్టడం ఇక్కడ విశేషం. ప్రతీ వారికీ సొంత కులాన్ని విమర్శించడం అలావాటు అయిపోయింది అని రాధా అన్న మాటలు నిజంగా పేర్ని నానిని ఉద్దేశించి అన్నవే అంటున్నారు. అంటే రాధా వైసీపీని టార్గెట్ చేశారు అనుకోవాలి. అంతే కాదు కాపులు గతంలో అనేక అవకాశాలు కోల్పోయారని ఇపుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపు ఇవ్వడం అంటే పవన్ కామెంట్స్ ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నట్లే. మొత్తానికి ఏపీలో కుల రాజకీయం మళ్ళీ మొదలైంది. అది ఎటు వైపు టర్న్ అవుతుంది అనేది చూడాలి.

Show comments