హుజూరాబాద్ పై కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యం క‌రెక్టేనా?

క‌రోనా రెండో ద‌శ ఉధృతంగా ఉన్న స‌మ‌యంలో కూడా నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు కేసీఆర్ స‌ర్కారు రెడీ అయింది. ఆ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో నాడు టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఉన్న నోముల భ‌గ‌త్ తో పాటు సీఎం కేసీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ప‌రిస్థితులు అంత తీవ్రంగా ఉన్న స‌మ‌యంలో కూడా నాగార్జున సాగ‌ర్ విష‌యంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ ప్ర‌భుత్వం.. హుజూరాబాద్ వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం, అదీ పండుగ‌ల పేరుతో ఎన్నిక వాయిదా వేయ‌మ‌ని కోర‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రభుత్వం రాసిన లేఖ ప్రకారమే ఎన్నికలు ఇప్పట్లో జరపడం లేదని ఎన్నికల సంఘం చెప్ప‌డంతో.. గెలుపుపై అనుమానాలు ఉండ‌డంతో కేసీఆర్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల సంఘం చెప్పినదాని ప్రకారం అక్టోబర్ నవంబర్లో దసరా దీపావళి పండుగలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నిర్వహణ కష్టమని తెలంగాణా ప్రభుత్వం లేఖ రాసింది. నిజానికి ఉపఎన్నికలకు పండుగలకు ఏమీ సంబంధం లేదు. ఉప ఎన్నికల తేదీ పండుగల తేదీలు క్లాష్ కాకుండానే ఎన్నికల కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందనటంలో సందేహంలేదు. పండుగలకు ముందో లేకపోతే తర్వాతో ఉప ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటిస్తే ప్రభుత్వానికి వచ్చిన సమస్యేమీ లేదు.

ఇంతకుముందు కూడా కరోనా వైరస్ పేరుతో ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా కరోనా వైరస్ కు ఎంఎల్సీ ఎన్నికల నిర్వహణకు ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే ఎంఎల్ఏ కోటాలో జరగబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో ఓట్లేయాల్సింది కేవలం 119 మంది ఎంఎల్ఏలు మాత్రమే. 119 మంది ఎంఎల్ఏల పోలింగ్ కు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేమని చెప్పటమే విచిత్రంగా ఉంది. మళ్ళీ ఇదే సమయంలో బహిరంగ సభల పేరుతో వేలాది మంది జనాలను ఒకేచోట కూర్చోబెడుతోంది.

అపుడు ఎంఎల్సీ ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదా వేయించారు. ఇపుడేమో హుజూరాబాద్ ఉపఎన్నికను పండుగల పేరుతో వాయిదా వేయించారు. ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయించాల్సిన ఎంఎల్సీ ఎన్నికలను నిర్వహిస్తే దాని ప్రభావం హుజూరాబాద్ ఉపఎన్నికపై పడుతుందని కేసీఆర్ ఆందోళ‌న ప‌డ‌డ‌మే ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే చాలామంది నేతలకు ఎంఎల్సీలుగా హామీ ఇచ్చారు. ఉన్నదేమో ఆరు పోస్టులు మాత్రమే. అంటే అవకాశం రానివారు ఎక్కడ ఎదురుతిరుగుతారో ? ఉపఎన్నికలో వ్యతిరేకం చేస్తారో అనే కార‌ణమ‌న్న ప్ర‌చారం ఉంది. అలాంటిది ఇప్పుడు ఉపఎన్నికే ఆల‌స్యం కావ‌డానికి కార‌ణ‌మ‌య్యారు. మ‌రి దీన్ని కేసీఆర్ త‌మ‌కు అనుకూలంగా ఎలా మార్చుకుంటారో వేచి చూడాలి.

Show comments