ఇంద్రుడు నరేంద్రుడు మోదీ – బాబు వల్ల కాదనుకున్నారా..?

రాజధానిగా అమరాతినే పూర్తి స్థాయిలో కొననసాగించాలని రాజధాని ప్రాంత గ్రామాల్లోని కొంత మంది డిమాండ్‌ చేస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. గత తొమ్మిది రోజులగా వారు వివిధ రూపాల్లో తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. ముఖ్యంగా మందడం, తుళ్లూరు గ్రామాల్లోని ప్రజలు రోడ్లపై భైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ రోజు 9వ మందడం గ్రామ ప్రజలు తమ నిరసనలో పట్టుకున్న ప్లకార్డులు, వాటిపై రాసిన వాక్యాలు, ప్రదర్శించిన చిత్రాలు ఆసక్తిని రేపుతున్నాయి. అంతేకాదు ఆ ప్లకార్డులపై రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.
మందడం గ్రామలో నిరసన వ్యక్తం చేస్తున్న వారు బీజేపీని, ప్రధాని మోదీని కీర్తిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.

‘అమరావతికి పునాది. ఇంద్రుడు నరేంద్రుడు మోదీ’

‘దేశం కోసం మోదీ.. మోదీ కోసం మేము’ వంటి వాక్యాలతో రాసిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శిస్తూ కొత్త చర్చకు తెరలేపారు.

మోదీని పొగుడుతూనే మరో పక్క ప్లకార్డుల్లో బీజేపీ అగ్రనేతల ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. మాజీ ప్రధాని, భారత రత్న అటల్‌ బిహారీ వాజపేయ్, మదన్‌మోహన్‌ మాలవియా, హోం మంత్రి అమిత్‌షా తదితర నేతల ఫొటోలను తమ ప్లకార్డుల్లో ప్రదర్శిస్తున్నారు.

ఇటీవల రాజధాని గ్రామాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటించారు. అమరావతి ఎక్కడికీ పోదని, మీకు అండగా ఉంటానని నిరసన తెలియజేస్తున్న వారికి భరోసా ఇచ్చారు. అయితే చంద్రబాబు శక్తిపై ఒక అంచనాకు వచ్చిన నిరసనకారులు ఆయన వల్ల తమకు నష్టం తప్ప లాభం లేదని గ్రహించినట్లున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు వల్ల మాత్రమే తమ డిమాండ్‌కు కొంత బలం చేకూరుతుందని భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే తొమ్మిది రోజుల తర్వాత తొలిసారిగా నిరసన కారులు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ పల్లవి అందుకున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Show comments