Indian Navy – AP Executive Capital : ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖ.. గుర్తించిన ఇండియన్‌ నేవీ

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వైసీపీ సర్కార్‌ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం కోర్టులో ఉన్నప్పటికీ.. ప్రజలు, కేంద్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ సంస్థలు.. మూడు రాజధానులను గుర్తిస్తున్నాయి. తాజాగా ఇండియన్‌ నేవీ ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను గుర్తించింది. డిసెంబర్‌ 4వ తేదీన విశాఖలో జరిగే నావికా దినోత్సవంలో పాల్గొనాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ను తూర్పు నావికా దళం ఆహ్వానించింది. తూర్పు నావికాదళం ఫ్లాట్‌ ఆఫీషర్, కమాండ్‌ ఇన్‌ చీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహుదూర్‌ సింగ్‌ శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి తూర్పు నావికా దళం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పేరుతో ముంబాయిలో నిర్మిస్తున్న యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ను త్వరలో ప్రారంభించబోతున్నట్లు బహుదూర్‌ సింగ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు.

నావికా దళమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టులో దేశంలోని వివిధ రాష్ట్రాలలో పెట్రోల్‌ ధరలు ఎలా ఉన్నాయనే అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు ఓ నివేదికను అందజేసింది. ఆ నివేదికలో రాష్ట్రాల వారీగా రాజధాని నగరాల్లో పెట్రోల్‌ ధరలు ఎంతెంత ఉన్నాయనే విషయాన్ని పేర్కొంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను పేర్కొంటూ.. ఆ నగరంలో పెట్రోల్‌ ధర ఎంత ఉందనే విషయం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో తెలిపింది. ఇప్పుడు నావికా దళం ఏకంగా విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పేరుతో యుద్ధనౌకనే నిర్మిస్తోంది. ఈ పరిణామం మూడు రాజధానుల ఏర్పాటుపై ముందుకు వెళుతున్న ఏపీ సర్కార్‌కు గుడ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకిస్తున్నా.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మూడు రాజధానుల ఏర్పాటు అవశ్యకమని వైసీపీ తేల్చిచెబుతోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలతోపాటు రాష్ట్రంలోని అన్నిజిల్లాల ప్రజలు వైసీపీకి మద్ధతు తెలిపారు. పంద్రాగస్టు వేడుకల సమయంలోనూ సీఎం వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల ఏర్పాటు, వాటి ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ హైకోర్టులో విచారణలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మూడు రాజధానుల అంశంపై ఉన్న కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం ఉంది.

Also Read : Prajasankalpa Yatra…ప్రజాసంకల్పయాత్రకు నాలుగేళ్లు

Show comments