100 వ టెస్టులో శతకం సాధించిన జో రూట్
భారత్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ జట్టు పైచేయి సాధించింది. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్(128*; 197 బంతుల్లో, 14×4, 1×6) శతకం సాధించగా, ఓపెనర్ సిబ్లీ (87; 285 బంతుల్లో, 12×4) అర్ధ శతకం సాధించాడు.
చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జో సారధి జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు శుభారంభం అందించడంతో 63 పరుగుల వరకూ ఇంగ్లండ్ వికెట్ కోల్పోలేదు. 63 పరుగులు జోడించిన అనంతరం ఇంగ్లండ్ జట్టుకు అశ్విన్ తొలుత షాకిచ్చాడు. జట్టు స్కోర్ 63 పరుగుల వద్ద ఓపెనర్ రోరీబర్న్స్(33) అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం అదే స్కోర్ వద్ద వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ లారెన్స్(0) బుమ్రా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో తొలి సెషన్‌లో భోజన విరామ సమయానికి ముందు ఇంగ్లాండ్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ సారధి జో రూట్ మరో ఓపెనర్ సిబ్లీతో కలిసి మరో వికెట్ పడకుండా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా సిబ్లీ అత్యంత నెమ్మదిగా ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్షించాడు. అత్యుత్తమ ఫామ్ లో ఉన్న జో రూట్ తన 100 వ టెస్టులో శతకం నమోదు చేయడం విశేషం. సిబ్లీ జోరూట్ జోడి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఆఖరి ఓవర్లో బుమ్రా ఓపెనర్ సిబ్లీని ఔట్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు 89.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు, అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టారు. తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ పట్టు బిగించడంతో రెండో రోజున భారత బౌలర్లు ఎంత త్వరగా ఔట్ చేయగలరు అన్నదానిపై భారత జట్టు గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.