Idream media
Idream media
హుజురాబాద్ ఉప ఎన్నిక.. తెలంగాణ చర్రితలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నిక ఇదేనని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆరు నెలలుగా హోరాహోరీ ప్రచారంతోపాటు అధికార టీఆర్‌ఎస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డింది. వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులు, స్థానిక నాయకులకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు, పార్టీలో చేరికలు, దళితబంధు అనే కొత్త పథకం ప్రారంభం, కొత్త పింఛన్లు, కొత్త రేషన్‌కార్డులు జారీ ప్రారంభం.. అంతా హుజురాబాద్ వేదికగానే జరిగాయి. మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచార బాధ్యతను భూజాలకెత్తుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ మాత్రం.. ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకంతో ప్రచారం నిర్వహించారు.
ఆరు నెలల సంగ్రామానికి శనివారం తెరపడింది. రికార్డు స్థాయిలో 86.57 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ రోజు.. టీఆర్‌ఎస్, ఈటెల రాజేందర్ ఎవరి ‘శక్తి’ వారు చూపించారు. ఓటర్లపై కనకవర్షం కురిసింది. ప్రజా తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. రేపు.. మంగళవారం ఎవరి రాత ఎలా ఉందో తేలిపోతుంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో గెలుపు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ దేనని దాదాపు అన్ని సంస్థలు వెల్లడించాయి. ఆరా సంస్థ టీఆర్‌ఎస్‌కు 38.99 శాతం ఓట్లు, బీజేపీకి 57.15 శాతం, పబ్లిక్ పల్స్ సంస్థ టీఆర్‌ఎస్‌కు 44.3, బీజేపీకి 50.9 శాతం, నాగన్న సర్వే టీఆర్‌ఎస్‌కు 45–48 శాతం ఓట్లు, బీజేపీకి 42–45 శాతం ఓట్లు వస్తాయని అంచనాలు వేశాయి. కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 3 శాతం ఓట్లు వస్తాయని లెక్కగట్టాయి. ఈ అంచనాలు నిజమైతే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కవు.
పోలింగ్ ముగిసిన తర్వాత టీఆర్‌ఎస్ పైకి ధీమాగా కనిపించింది. కానీ ఆ పార్టీ నేతలు ఆందోళనతోనే ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్ ఫలితాలు కూడా టీఆర్‌ఎస్‌లో ఆందోళన మరింత పెంచాయి. ఈ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ సర్కార్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ ఈటెల రాజేందర్‌ను ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డారు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి గ్రామ స్థాయి నాయకులకు కూడా ఫోన్ చేశారు. దీనికి దళిత బంధు పథకం అమలును ఉపయోగించుకున్నారు.
దాదాపు రెండు దశాబ్ధాలుగా తన సహచరుడుగా ఉన్న ఈటెల రాజేందర్.. అసెంబ్లీలో తనకు ప్రత్యర్థిగా మారకూడదనే ఆలోచన కేసీఆర్‌ది. ఈటెల బలం ఏమిటో తెలిసినవాడు కనుక.. ఉప ఎన్నిక కోసం అన్ని అస్త్రాలు ఉపయోగించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా.. ఎగ్జాట్ పోల్ ఫలితాలు రేపు రాబోతున్నాయి. కేసీఆర్ పంతం నెగ్గుతుందా..? ఈటెల పట్టు నిలుస్తుందా..? చూడాలి.
Also Read : Huzurabad By Election – పెరిగిన పోలింగ్.. ఎవరికి మేలు..?