బ‌రిలోకి టీడీపీ : హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గొప్ప ట్విస్టు..!

ఆశ్చ‌ర్యం.. సంబ్ర‌మాశ్చ‌ర్యం.. తెలంగాణలో క‌నుమ‌రుగైపోయింద‌నుకుంటున్న తెలుగుదేశంలో పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో పోటీకి సై అంటోంది. కాస్కోండి అంటూ అధికార పార్టీ స‌హా అన్ని పార్టీల‌కూ స‌వాలు విసురుతోంది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత నుంచీ ఇక్క‌డ టీడీపీ ఖాళీ అవుతూ వ‌చ్చింది. రాష్ట్ర విభజన నాటి నుంచి మొన్నటి వరకు టీటీడీపీని నడిపించిన ఎల్‌ రమణ కూడా ఎప్పుడో గుడ్‌బై చెప్పేశారు. టీడీపీతో ఉంటే.. అధ్యక్ష పదవి మాత్రమే చేతిలో ఉంటుంది. నాయకులకు రాజకీయాల్లో అదొక్కటే పరమావధి కాదు. ఎన్నికల్లో కొట్లాడాలి. గెలవాలి… అధికారం చేపట్టాలి.. పదవుల్లో ఉండాలి. వీటి కోసం వేచి వేచి చూసిన ఎల్‌ రమణ సైకిల్‌పై టీడీపీ లోడ్‌ ఎత్తలేమని భావించి.. కారులో ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎల్‌ రమణ ప్లేస్‌లో టీటీడీపీ చీఫ్‌గా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు వచ్చారు. తెలంగాణలో టీడీపీ ఉందంటే ఉంది. ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నారంటే ఉన్నారంతే. అంద‌రూ అనుకుంటూ ఉన్నారు. అలాంటి పార్టీ ఇప్పుడు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Also Read : హుజూరాబాద్ లో టీఆర్ఎస్ లెక్క‌లు గెలుపు అందిస్తాయా?

తెలంగాణలో టీడీపీ దాదాపు కనుమరుగైంది. ఆ పార్టీలో ఉన్న నేతలంతా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో టీడీపీకి ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. వారిద్దరూ టీఆర్‌ఎస్‌ గూటిలోకి వెళ్లిపోయారు. ఇక జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గుండు సున్నా. గతంలో జరిగిన జీహెచ్ ఎంసీ ఒక్కటైనా సీటు వచ్చింది. ఇప్పుడు అది కూడా లేదు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ పటిష్ఠంగా కనిపిస్తున్నా.. ఆపాటి పటిష్టత టీడీపీలో లేదు. ఒకప్పుడు కార్యకర్తలు.. నాయకుల రాకపోకలతో కళకళలాడిన పార్టీ ఆఫీస్‌.. ఇప్పుడు ఎవరోస్తారా.. తాళం ఎవరు తీస్తారా అని ఎదురు చూడాల్సిన దుస్థితి. అలాంటి స్థితిలో ఉన్న టీడీపీ పోటీకి సిద్ధం కావ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే.

తెలంగాణ తెలుగుదేశం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. టి-టిడిపి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి జోజిరెడ్డి దీన్ని ధృవీకరిస్తూ హుజూరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. “ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మా అధినేత చంద్రబాబు నాయుడు మా పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారు” అని జోజిరెడ్డి ప్రకటించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న అధికార టీఆర్ఎస్ బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేడ‌రు లేకుండా.. అస‌లు ఇక్క‌డ పార్టీయే లేద‌నుకుంటున్న త‌రుణంలో తెలంగాణ టీడీపీని ప్రజలు ఎంత వ‌ర‌కు స్వీక‌రిస్తారో వేచి చూడాలి.

Also Read : పవన్ మీద ఆశలతో పార్టీని విస్మరిస్తున్నారు, టీడీపీ నేతల్లో అంతర్మథనం

Show comments