Idream media
Idream media
హుజూరాబాద్ ఉప ఎన్నిక ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. బీజేపీ అనడం కంటే ఈటెల రాజేందర్ అనడం కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గెలిచేందుకు పార్టీ పరంగా కన్నా, వ్యక్తిగతంగా రాజేందర్ చేస్తున్న కృషి చాలా ఎక్కువ. మరి ఎంత వరకు ఆ కృషి ఫలిస్తుందనేది కేవలం రెండు రోజుల్లో తేలిపోనుంది. మరోవైపు స్థానికంగా ఈటెలకు ఉన్న బలాన్ని ముందే పసిగట్టిన టీఆర్ఎస్ ఆది నుంచీ తనకున్న అధికార హోదాతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హుజూరాబాద్ నాయకత్వానికి కీలకమైన పదవులు అప్పగించి బలాన్ని పెంచుకుంది. దళిత బంధు పథకాన్ని ప్రకటించి సంచలనం రేపింది. ఇక్కడ గెలుపును ఏకంగా ప్రభుత్వమే సవాలుగా తీసుకుంది. అందువల్ల ఈ ఎన్నికపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇంత వరకు కష్టపడింది ఓ లెక్క, ఇక ఈ రెండు రోజుల్లో చక్రం తిప్పేది మరో లెక్క అనేది ఆయా పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. ఈ మేరకు అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తెర వెనుక మంత్రాంగాలు మొదలుపెట్టాయి. ప్రచారంలో తిరుగుతున్నప్పుడు కొన్ని సంఘాలకు, బస్తీల నేతలకు ఆశ పెట్టిన తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. ఈసీ ఆదేశాల ప్రకారం.. బయటి నేతలు సొంత గ్రామాలకు వెళ్లిపోవడంతో స్థానికంగా ఉన్న వారే ఈ తతంగాన్ని చాలా రహస్యంగా చేపడుతున్నారు. ఆర్థికంగా చూస్తే ఈటెల బలమైన నేత. టీఆర్ఎస్ బలమైన పార్టీ. ఈ క్రమంలో ఇరు పార్టీలూ ఎక్కడా తగ్గకుండా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది.
మూడు నెలలుగా మైకుల ముందు హోరెత్తించిన వారంతా, ఇప్పుడు నిశ్శబ్దంగా ప్రచారాన్ని చేస్తుకుంటూ పోతున్నారు. 30వ తేదీ పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 2వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఆ ఫలితాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇరు పార్టీలు జోరుగా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజేందర్ నోటిఫికేషన్ కు ముందే.. నియోజకవర్గ ప్రజలకు పువ్వు గుర్తుతో కూడిన గడియారాలు పంచిపెట్టారు. దానిపై గతంలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. రాజేందర్ అంటే ఇప్పటి వరకు కారు గుర్తు అన్న ముద్రను చెరిపేసేందుకు ఆయన కమలం గుర్తు ఉన్న గడియారాలను పంచడం వివాదాస్పదంగా మారింది.
ఇక చివరి రోజుల్లో టీఆర్ఎస్, బీజేపీ ఓటర్లను తీవ్ర స్థాయిలో ప్రలోభాలకు గురి చేసేందుకు కొన్ని టీమ్ లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రచార హోరును పరిశీలిస్తే.. ఇరు పార్టీలూ నువ్వా – నేనా అనే రీతిలో ఉన్నాయి. ప్రలోభాల విషయంలోనూ ఇరు పార్టీలు పోటీపడుతున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓటు పదివేలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు 3 కోట్ల 29 లక్షల 36 వేల 827 రూపాయలను సీజ్ చేశారు అధికారులు. 1091 లీటర్ల మద్యాన్ని, 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 30 గ్రాముల బంగారం, 14 కిలోల వెండిని సీజ్ చేశారు. 66 చీరలు, 50 టీ షర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనా కీలకంగా మారిన చివరి రోజులను తమకు అనుకూలంగా మార్చుకుని ఎవరు విజయవంతం అవుతారో వేచి చూడాలి.
Also Read : Badvel By Polls -బద్వేలు ఉప ఎన్నికలు, మెజార్టీపై మొదలయిన పందాలు