Huzurabad By Election – పెరిగిన పోలింగ్‌.. ఎవరికి మేలు..?

తెలుగు రాష్ట్రాలలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్‌ ముగిసింది. పలు చోట్ల ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్‌ సిబ్బంది. దీంతో బద్వేల్, హుజురాబాద్‌లో మొత్తం ఎంత పోలింగ్‌ నమోదయిందో తెలిసేందుకు మరికొంత సమయం పట్టనుంది.

హుజురాబాద్‌లో పోలింగ్‌ హోరాహోరీగా సాగింది. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ జరిగింది. రాత్రి ఏడు గంటల వరకు హుజురాబాద్‌లో 86.40 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇంకా పలుచోట్ల పోలింగ్‌ జరుగుతోంది. దీంతో పోలింగ్‌ శాతం మరింతగా పెరగబోతోంది. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల్లో 84.42 శాతం పోలింగ్‌ నమోదవగా.. ఇప్పటికే ఈ మార్క్‌ దాటింది. మొత్తంగా 90 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉంది.

హుజురాబాద్‌లో పోలింగ్‌ పెరగడంతో.. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. పెరిగిన పోలింగ్‌ వల్ల ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? అనే అంశంపై బూత్‌ల వారీగా నమోదైన ఓట్లను పరిశీలిస్తూ.. నేతలు విశ్లేషణలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటుకు ఆరు వేల రూపాయలు ఇస్తుందనే ఆరోపణ బీజేపీ చేయగా.. బీజేపీ ఓటుకు 15 వందల రూపాయలు ఇస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేశారు. డబ్బులు పంచుతున్నారంటూ ఇరు పార్టీల నేతల మధ్య పలు చోట్ల వాగ్వాదాలు జరిగాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌కు విజయావకాశాలు ఉన్నాయని వెల్లడైంది. 10 నుంచి 15 వేల ఓట్ల మెజారిటీతో ఈటెల గెలుస్తారని పబ్లిక్‌ పల్స్, ఆత్మసాక్షి సర్వే సంస్థలు అంచనా వేశాయి. సర్వే సంస్థల అంచనాలు ఇలా ఉంటే.. మరో రెండు రోజుల్లో (మంగళవారం) తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.

Also Read : By Election Polling Percentage – అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ..

Show comments