ఉప్పెన ఎన్ని కోట్లు రాబట్టాలి

2021లో క్రాక్ తర్వాత ఆ స్థాయిలో భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా ఉప్పెన. హీరో, హీరోయిన్, దర్శకుడు ముగ్గురు కొత్తవాళ్ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీకి ఇలాంటి క్రేజ్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇదంతా మెగా బ్రాండ్ ఉండటం వల్ల సాధ్యపడలేదు. ఎందుకంటే ఇదే ట్యాగ్ తో గతంలో వచ్చిన అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ ల మొదటి చిత్రాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. కానీ ఉప్పెన ఏదో మేజిక్ చేసేలాగే కనిపిస్తోంది. అడ్వాన్ బుకింగులు ప్రస్తుతానికి స్లోగా ఉన్నట్టు అనిపిస్తున్నా ఎల్లుండి ఉదయానికి అన్నిచోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పడటం ఖాయమే. అంత బజ్ ఉంది మరి.

మరి దీనికి థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందనే సందేహం రావడం సహజం. ట్రేడ్ నుంచి అందుతున్న అనధికార సమాచారం మేరకు సుమారు 22 కోట్ల దాకా దీని మీద పెట్టుబడులు సాగినట్టు వినికిడి. ఉప్పెనకు చాలా అంశాలు కలిసి వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వంద శాతం సీటింగ్ కి అనుమతులు ఇచ్చేసింది. ఏపిలోనూ రేపో ఎల్లుండో పెర్మిషన్లు రావొచ్చు. ఇది పెద్ద సానుకూలాంశం. అంతే కాదు ప్రేమికుల రోజు వీకెండ్ లో వచ్చింది. అది కూడా ఆదివారం. ఇంకేముంది లవర్స్ ఎంజాయ్ చేయడానికి ఉప్పెన కన్నా బెస్ట్ ఎంటర్ టైన్మెంట్ ఏముంటుంది. ఇవన్నీ కలెక్షన్స్ పరంగా చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి.

వీటి సంగతి ఎలా ఉన్నా ఉప్పెనకు పబ్లిక్ టాక్ అండ్ ఆన్ లైన్ రివ్యూస్ చాలా ముఖ్యం. అసలే క్లైమాక్స్ గురించి, కథలో ఉన్న కీలకమైన మలుపుల గురించి చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ చిరంజీవి దీని గురించి చూచాయగా మాట్లాడారు. ఆ పాయింట్ కనెక్ట్ అయితే బాగుంటుంది. ఏదైనా తేడా జరిగితే ఇబ్బందులు తప్పవు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ బ్యాక్ అప్, కృతి శెట్టి అందం, వైష్ణవ్ లుక్స్ ఇవన్నీ ఉప్పెనకు దన్నుగా నిలుస్తున్నాయి. ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ తప్ప ఇంకే పోటీ లేని ఉప్పెన అంచనాలు అందుకుంటే మాత్రం సంచలనాలు షురూ అయిపోతాయి. చూద్దాం.

Show comments