అన్నీ కుదిరితే పెను ఉప్పెనే

థియేట్రికల్ రిలీజ్ కోసం ఏడాది పాటు ఎదురు చూసిన దానికి తగిన ఫలితాన్ని ఉప్పెన ఓపెనింగ్స్ రూపంలో అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యూజిక్, ట్రైలర్ ఇప్పటికే అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లాయి. వైష్ణవ్ తేజ్ మెగా కాంపౌండ్ హీరో అనే యాంగిల్ లో కాకుండా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని చూడబోతున్నామన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యూత్ ని అప్పుడే తన మాయలో పడేసుకున్న హీరోయిన్ కృతి శెట్టి కూడా ఫస్ట్ డే ప్రభావంలో భాగం కాబోతోంది. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన బుచ్చిబాబు డెబ్యూతోనే ఈ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడం చిన్న విషయం కాదు.

ఇప్పుడు అసలైన సవాల్ 12వ తేదీన ఉంది. ఇది ఒకరకంగా బంగారం లాంటి అవకాశం. ఆ రోజు పెద్దగా పోటీ లేదు. ఉన్న ఒక్క ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ మీద మినిమమ్ బజ్ కూడా లేదు. పైగా జగపతిబాబు హీరో కావడంతో టాక్ వస్తే తప్ప ఇలాంటివి పుంజుకోవడం కష్టం. అందుకే ఉప్పెనకు దాన్ని కాంపిటీషన్ గా పరిగణించలేం. ఉప్పెనకు భారీ అందండలతో పాటు డిస్ట్రిబ్యూటర్ల సపోర్ట్ ఉంది కాబట్టి కౌంట్ పరంగా చాలా ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ కాబోతోంది. చరణ్ చిరుత ఫిగర్స్ ని దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒకవేళ టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం నిర్మాణ సంస్థ మైత్రి పంట పండినట్టే.

సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా తగ్గిపోయింది. క్రాక్, మాస్టర్లు ఓటిటిలో వచ్చేశాయి. అల్లుడు అదుర్స్ ని 13 నుంచి స్ట్రీమ్ చేయబోతున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తో రెడ్ కూడా వచ్చేస్తుంది. వీటి తర్వాత వచ్చిన బంగారు బుల్లోడు డిజాస్టర్ కాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా డీసెంట్ వసూళ్లతో గట్టెక్కింది కానీ టాక్ పరంగా చూసుకుంటే హిట్ అని చెప్పలేం. ఇక జాంబీ రెడ్డి కూడా స్లోగానే ఉంది. డివైడ్ టాక్ ప్రభావం చూపిస్తోంది. సో ఫిబ్రవరి 12న ఉప్పెనకు ఫ్రీ గ్రౌండ్ దొరికేసింది. బాగుందనే మాట వస్తే చాలు వసూళ్ల సునామినే. ఆపై వారం 19న మరీ క్రేజ్ ఉన్న మూవీ ఏవీ లేవు కాబట్టి పండగ చేసుకోవడమే తరువాయి. మరి ఏమవుతుందో ఇంకో ఆరు రోజుల్లో తేలిపోతుంది.

Show comments