Adinarayana Reddy, Chandrababu Naidu – ఆ బిజెపి రెడ్డి గారికి కాంగ్రెస్ రెడ్లు కావాలంట, చంద్రబాబు ఋణం తీర్చుకుంటున్నాడే..?

ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది చేసే రాజకీయం కాస్త వింతగా విడ్డూరంగా ఉంటుంది. ఇతర పార్టీల్లో ఉన్నా సరే గత స్నేహాలను మర్చిపోలేని కొంతమంది నాయకులు వాళ్ల కోసం పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కష్టపడుతుంటారు. రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా సరే వారు చేయాలనుకున్నది చేస్తూ పైకి చక్కగా నటించే ప్రయత్నం కూడా చేస్తారు. అందులో ప్రధానంగా చెప్పుకునే వారిలో మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి ముందు వరుసలో ఉంటారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో బిజెపి అధిష్టానాన్ని ఒప్పించి పోటీకి తన సన్నిహితుడైన వ్యక్తిని దింపిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయిలో అండదండలు అందించే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

తన కుటుంబాన్ని మొత్తం తెలుగుదేశం పార్టీ లోకి పంపించి తాను మాత్రం బీజేపీ లో ఉండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది నేతలను ఇతర పార్టీల నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో తనతో సన్నిహితంగా ఉన్న కొంతమంది రెడ్డి సామాజిక వర్గ నాయకులను తెలుగుదేశం పార్టీలోకి పంపించడానికి ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని రాయలసీమలో ఉన్న కొంతమంది రెడ్డి సామాజికవర్గం నేతలతో మాట్లాడుతున్నారని కడప జిల్లాలో ప్రచారం ఊపందుకుంది.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతు కూడగట్టేందుకు తీవ్రస్థాయిలో ఆయన కష్టపడుతూ… కొంతమంది కీలక నాయకులకు తెలుగుదేశం పార్టీలో ఇచ్చే పదవులకు సంబంధించి ఆయనే స్వయంగా హామీ కూడా ఇస్తున్నారట. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక కీలక నేతతో కలిసి ఆయన ఈ రాజకీయం చేస్తున్నారని టిడిపి వర్గాలే అంటున్నాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు స్వయంగా చంద్రబాబు తో కూడా మాట్లాడించే ప్రయత్నం ఈ రెడ్డి గారు చేస్తున్నారని తెలుస్తోంది.

ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లకు కేసులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేదానిపై ఒక స్పష్టత ఇస్తే న్యాయపరంగా అన్ని సహాయ సహకారాలు పార్టీ నుంచి అందుతాయని ఆయన హామీ ఇస్తున్నారట. వీరికి ఒక ప్రముఖ పత్రికకు సంబంధించిన జర్నలిస్ట్ కూడా సహకారం అందిస్తున్నారని, అధికార పార్టీకి సంబంధించిన నివేదికలను ఇస్తూ ఒక భ్రమలో ఉంచే ప్రయత్నం కొంత మంది రెడ్డి సామాజిక వర్గ నాయకులు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తో ఇటీవలి కాలంలో ఆయన బెంగళూరులో రెండు మూడు సార్లు సమావేశం కూడా నిర్వహించారట.

పార్టీలోకి వచ్చే నాయకులు ఎవరు, వైసీపీ లోకి వెళ్లే వారు ఎవరు… ఆర్థికంగా బలంగా ఉండేది ఎవరు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సదరు నేతతో కలిసి ఆయన సేకరించారని సమాచారం. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ఏంటనే దానిపై ఒక స్పష్టత కూడా ఇచ్చారట ఆదినారాయణ రెడ్డి. తన మాట నమ్మకపోతే చంద్రబాబుతో కూడా వెంటనే మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారని, అవసరమైతే చంద్రబాబు వద్దకు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారని అంటున్నారు.

ఇటీవల ఒక కాంగ్రెస్ పార్టీ యువనేతను ఇదే విధంగా తెలుగుదేశం పార్టీలోకి ఆదినారాయణ రెడ్డి స్వయంగా పంపించారని సమాచారం. సదరు జర్నలిస్టు సహకారంతో కడప జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేతను పంపడానికి ఆదినారాయణరెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని ఆయనకు ఏకంగా కడప ఎంపీ సీటు కూడా ఆఫర్ చేయడమే కాకుండా… ఒకవేళ ఆయన ఆ ఆఫర్ను తిరస్కరిస్తే సొంత నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీటు ఇచ్చేందుకు స్వయంగా పార్టీ అధిష్టానం నుంచి హామీ కూడా ఇప్పించారట. మరి చంద్రబాబు పై ఈ స్థాయిలో విధేయత చాటుకుంటున్న ఆదినారాయణరెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Also Read : Tdp, Butchaiah Chowdary- ఏ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు బుచ్చయ్య..?

Show comments