Idream media
Idream media
ఎవరికైనా రాజకీయంగా ప్రమోషన్ వచ్చిందంటే.. ఆ వ్యక్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. గొప్ప అవకాశం దొరికిందంటూ చర్చలు మొదలవుతాయి. కానీ.. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు కు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా అవకాశం దక్కడంపై వినూత్న చర్చ జరుగుతోంది. హరీశ్ ను అయినా ఈ శాఖలో నిలవనిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ మంత్రులుగా కొనసాగిన వారెవరికీ ఆ శాఖ అచ్చు రాకపోవడమే ఇందుకు కారణం.
టీఆర్ ఎస్‌లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీశ్‌రావుకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చాయి. రెండు చోట్లా కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. దుబ్బాకలో రఘునందన్ రావు, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయినప్పటికీ హుజూరాబాద్ ఎన్నికల అనంతరం హరీశ్‌కు మరో శాఖ వైద్య, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమాన్ని అప్పగించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో విచిత్రం ఏంటంటే ఇప్పటికే హరీశ్ బాధ్యతలు వహిస్తున్న ఆర్థిక శాఖ, తాజాగా చేతిలోకొచ్చిన వైద్య శాఖ రెండూ గతంలో ఈటల రాజేందర్ మంత్రిగా కొనసాగినవే. ఆర్థికం సంగతి పక్కనబెడితే.. ఆరోగ్యం మాత్రం టీఆర్ఎస్ లో ఎవరికీ పెద్దగా కలిసి రాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో మొదటి నుంచీ ఈ శాఖ చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.
Also Read : TRS, KCR, BJP – జాగ్రత పడుతున్న కేసీఆర్..!
తెలంగాణ ఏర్పడ్డాక.. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో తాటికొండ రాజయ్యకు డిప్యూటీ సీఎం హోదాతో పాటు ఆరోగ్య శాఖను కూడా అప్పగించారు. ఎనిమిది నెలల పాటు ఆయన ఆ శాఖలో కొనసాగారు. రాజయ్యను తొలగించడానికి అవినీతి ఆరోపణలు కారణంగా చూపారు. అసలు కారణాలు వేరే ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ లక్ష్మారెడ్డి ఆ పదవిలోకి వచ్చారు. ఆయన కూడా ఆ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోసారి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆయనకు ప్రాధాన్యం దక్కలేదు. తొలి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటలకు రెండో సారి వైద్య ఆరోగ్య శాఖ అప్పగించారు. తనకు ఇచ్చిన బాధ్యతలను ఈటల సక్రమంగానే నెరవేర్చారు. ప్రధానంగా కరోనా సమయంలో కీలకంగా వ్యవహరించారు. అయినప్పటికీ ఆయనను ఆ పదవి నుంచి తొలగించనున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. భూ కబ్జా ఆరోపణలు బహిర్గతం కావడంతో ఆ ప్రచారం నిజమైంది. చివరకు ఈ ఏడాది మే 2న ఈటలను బర్తరఫ్ చేశారు.
ఈ నేపథ్యంలో అసలు వైద్యశాఖనే మంత్రులకు కలిసిరావడం లేదనే ప్రచారం మొదలైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రులకు కలిసి రావడం లేదా అనే నమ్మకాలు, విశ్వాసాలపై రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆ శాఖ హరీశ్ చేతిలోకి వచ్చింది. మరోసారి చర్చకు దారి తీస్తోంది. కేసీఆర్ కుటుంబం హరీశ్‌ను దూరం పెడుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా హరీశ్ కనిపించ లేదు. అలాగే ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు కూడా ఆయన వెళ్లలేదు. ఇటువంటివి అన్నీ ఈ తరహా ప్రచారానికి కారణాలుగా మారాయి. ఇటువంటి తరుణంలో ఆయనకు మరో శాఖను ఇచ్చి కేసీఆర్ చాణుక్యతను ప్రదర్శించారు. కానీ.. గతంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హరీశ్ కు వైద్య ఆరోగ్య శాఖ ఎంత వరకు కలిసి వస్తుందనే చర్చ జరుగుతోంది. మరి మున్ముందు ఏం జరగనుందో వేచి చూడాలి.
Also Read : KCR,Modi,Central Government-కేసీఆర్ కొత్త ఉద్యమం.. ఎలా ఉండసంక్షేమాన్ని