Rumble in the Jungle – బాక్సింగ్ చరిత్రలో అతి గొప్ప ఫైట్

అక్టోబర్ 30,1974 న 32 సంవత్సరాల మాజీ ఛాంపియన్ మహమ్మద్ అలీ, 25 సంవత్సరాల ఛాంపియన్ జార్జ్ ఫోర్ మన్ మధ్య ఆఫ్రికన్ దేశం జైరేలో బాక్సింగ్ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ కోసం జరిగిన పోరాటం బాక్సింగ్ చరిత్రలోనే అతిగొప్ప ఫైట్ గా విశ్లేషకులు, క్రీడాభిమానులు నేటికీ భావిస్తారు. ఒకప్పుడు తిరుగులేని ఛాంపియన్ అయినా తనకన్నా చిన్నవాడు, అప్పటి వరకు ఓటమి ఎరుగని ఛాంపియన్ ఫోర్ మాన్ మీద ఆలీ విజయం సాధించగలడని అతని అభిమానులు కూడా నమ్మలేదు.

బాక్సింగ్ లైసెన్సు రద్దు చేసిన వియత్నాం యుద్ధం

1964లో తిరుగులేని యోధుడు అని పేరు తెచ్చుకున్న హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ సోనీ లిస్టన్ ని ఆరు రౌండ్లలో నాకౌట్ చేసి, ఇరవై రెండేళ్ల వయసులో అతి చిన్న వయసులో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ గెలిచిన రికార్డు సృష్టించిన కేసియస్ క్లే (మహమ్మద్ అలీ అసలు పేరు), ఆ తర్వాత ఒకవైపు బాక్సింగ్ రింగులో వరుస విజయాలు సాధిస్తూ, మరోవైపు నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడుతున్న వారితో కలిసి, ఇస్లాం మతం స్వీకరించి, తన పేరును మహమ్మద్ అలీగా మార్చుకున్నాడు.

అప్పుడే వచ్చిన వియత్నాం యుద్ధంలో అమెరికా తరఫున పోరాడడానికి సైన్యంలో చేరడానికి మహమ్మద్ అలీ నిరాకరించాడు. దాంతో 1967 మార్చి నెలలో అతని హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ ని లాక్కోవడమే కాకుండా, బాక్సింగ్ లైసెన్సు రద్దు చేశారు అధికారులు. కోర్టు అతనికి పదివేల డాలర్ల జరిమానాతో పాటు, అయిదు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది. అయితే ఆలీ జరిమానా కట్టి, సుప్రీంకోర్టుకి అప్పీలు చేసి జైలుకి వెళ్ళకుండా బయటే ఉన్నాడు.

1971లో కోర్టు ఆలీ మీద కేసు కొట్టేశాక తన హెవీ వెయిట్ టైటిల్ తిరిగి పొందడానికి జో ఫ్రేజియర్ తో తలపడి, తన కెరీర్ లో మొదటి ఓటమి చవి చూశాడు ఆలీ. ఆ తర్వాత జరిగిన బాక్సింగ్ ఫైట్స్ లో సాధించిన విజయాలతో ఫ్రేజియర్ తో మరోసారి తలపడ్డాడు ఆలీ. అప్పటికి తన హెవీ వెయిట్ టైటిల్ ని కోల్పోయిన ఫ్రేజియర్ మీద ఈసారి విజయం సాధించాడు ఆలీ.

Also Read : భారత జట్టు మొదటి క్రికెట్ టెస్టు ఆడిన రోజు

టైటిల్ కోసం పోరాటం

జో ఫ్రేజియర్ మీద సాధించిన విజయంతో ఈసారి ఛాంపియన్ జార్జ్ ఫోర్ మన్ తో తలపడి హెవీ వెయిట్ టైటిల్ దక్కించుకోవాలని అనుకున్నాడు. మొదటినుంచి ప్రత్యర్ధులను చిత్తు చేయడానికి ఆలీకి ఉపయోగపడింది అతని వేగం. రింగులో చురుగ్గా కదులుతూ ప్రత్యర్థి విసిరిన ముష్టిఘాతాల నుంచి తప్పించుకుంటూ, అదను చూసి దెబ్బ తీయడం అతని విజయ రహస్యం. అయితే ముప్పై రెండేళ్ళ వయసులో అతనిలో ఆ చురుకుదనం ఉందా అన్నది అతని అభిమానుల సందేహం. అయితే ఆలీకి తనమీద తనకి ఉన్న నమ్మకంతో తనకన్నా ఏడేళ్లు చిన్న వాడైన జార్జ్ ఫోర్ మాన్ తో తలపడడానికి సిద్ధమయ్యాడు.

అయితే అమెరికా నిఘా సంస్థలు ఇంకా మహమ్మద్ అలీ మీద నిఘా పెట్టడం, తన విధానాలతో అమెరికాలోని అధిక భాగం శ్వేతజాతీయులు ఆలీ మీద ద్వేషభావంతో ఉండడం వల్ల ఆలీ, ఫోర్ మాన్ పోరాటానికి స్పాన్సర్లు దొరకలేదు. అయితే ఆలీకి ప్రమోటర్ గా వ్యవహరిస్తున్న డాన్ కింగ్ మాత్రం ఈ పోరాటాన్ని చూడ్డానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారని సరిగ్గా అంచనా వేసి, అమెరికా బయట స్పాన్సర్ల వేటలో ఉండగా అతనికి మధ్య ఆఫ్రికా దేశమైన జైరే (ప్రస్తుత కాంగో) అధ్యక్షుడు మొబూటో సెసే సెకో నుంచి పిలుపు వచ్చింది.

జైరే అధ్యక్షుడికి సలహాదారుడు అయిన అమెరికా జాతీయుడు ఫ్రెండ్ వైమన్ ఈ బాక్సింగ్ పోరాటం తమ దేశంలో నిర్వహిస్తే లభించే ప్రచారం సహజ వనరులు, పర్యాటక స్థలాలు పుష్కలంగా ఉన్న తమ దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాక అధ్యక్షుడి వ్యక్తిగత ప్రతిష్ట కూడా పెరుగుతుందని సలహా ఇవ్వడంతో పోటీదారులు ఇద్దరికీ చెరో అయిదు మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఇవ్వడానికి అధ్యక్షుడు అంగీకరించాడు. ఇది కాకుండా డాన్ కింగ్ తన పరిచయాలను ఉపయోగించి టెలివిజన్ ప్రసార హక్కులను అధిక మొత్తానికి విక్రయించాడు.

Also Read : Test Cricket – 10 Lakh Runs -టెస్టు క్రికెట్ లో పది లక్షలపరుగు సాధించిన రోజు

Rumble in the Jungle

ప్రమోటర్ డాన్ కింగ్ ముందు ఈ ఫైట్ కి “బానిస షిప్ నుంచి ఛాంపియన్ షిప్ వరకూ” అని పేరు పెట్టి, పోస్టర్లు కూడా అచ్చు వేయించాడు. అయితే అది జైరే అధ్యక్షుడికి నచ్చకపోవడంతో, Rumble in the Jungle “అని మార్చాడు. Rumble అన్న పదానికి గర్జన, ఉరుము, కొట్లాట అని అర్ధాలు ఉండడంతో ఆ ఫైట్ కి బాగా సరిపోయింది. ఇద్దరు బాక్సర్లూ మూడు నెలల ముందుగానే జైరే చేరుకుని అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఆ వాతావరణానికి అలవాటు పడ్డారు. ముందుగా సెప్టెంబర్ 24న ఫైట్ నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేసి, ట్రైనింగ్ లో ఫోర్ మాన్ గాయపడి, ఆ గాయానికి కుట్లు వేయవలసి రావడంతో అక్టోబర్ 30 కి వాయిదా వేశారు.

అమెరికాలో టెలివిజన్ ప్రేక్షకులకు అనువైన సమయం కోసం జైరే రాజధాని కిన్షాసాలో తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫైట్ మొదలుపెట్టారు. స్టేడియం మొత్తం అరవై వేల మంది ప్రేక్షకులతో నిండిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది టీవీలో ఆ ఫైట్ ప్రత్యక్ష ప్రసారం చూశారని ఒక అంచనా. అప్పటివరకూ తన ప్రత్యర్ధుల మీద సమ్మెటపోట్లలాంటి బలమైన పంచ్ లతో విరుచుకుపడి నాకౌట్ చేసిన ఫోర్ మాన్ ముష్ఠిఘాతాలను ఆలీ ఎలా ఎదుర్కుంటాడో అని ఎదురుచూస్తున్న అభిమానులకు తను ఆ ఫైట్ కోసమే రూపొందించిన వ్యూహాన్ని బయటపెట్టాడు ఆలీ.

Also Read : ఆ ఒలింపిక్ పతకాలు భారత దేశానివో బ్రిటన్ దేశానివో ఇప్పటికీ స్పష్టత లేదు

Rope-a-dope అని ఆ తర్వాత పేరు పెట్టిన ఈ వ్యూహంలో రింగు చుట్టూ ఉన్న తాళ్ళమీద వాలిపోయి, రెండు చేతులతో శరీరాన్ని, తలనూ కాపాడుకుంటూ ప్రత్యర్థి పంచ్ లు చేతులమీద తగిలేలా, ఆ తాకిడి రింగుకున్న తాళ్ళమీదకు బదిలీ అయ్యేలా చేసే ఈ వ్యూహంతో ఫోర్ మాన్ అలసిపోయేలా చేసి, అప్పుడు తను విజృంభించాలనుకున్న ఆలీ ఆలోచన చక్కగా పనిచేసింది. సమ్మెటపోట్ల లాంటి ఫోర్ మాన్ పంచులు అయిదో రౌండుకి సుతారమైన తోపులు లాగా మారిపోతే, ఎనిమిదో రౌండులో కొందరు జర్నలిస్టులు రాసినట్టు, “ఎలుగుబంటి చర్మం మీద తేనెటీగ కట్టినట్టు బలహీనపడి పోయాయి”.

ఆ అదను కోసమే ఎదురు చూస్తున్న ఆలీ ఎడాపెడా కురిపించిన ముష్ఠిఘాతాలతో మరో రెండు సెకన్లలో రౌండ్ ముగుస్తుందనగా ఫోర్ మాన్ కింద పడిపోయాడు. రిఫరీ పది అంకెలు లెక్కపెట్టి అతను లేకపోవడంతో నాకౌట్ ద్వారా ఆలీ గెలిచినట్టు ప్రకటించాడు.

ఈ ఫైట్ తరువాత ఒకసారి హెవీ వెయిట్ టైటిల్ కోల్పోయి, మళ్ళీ గెలుచుకుని 1981లో బాక్సింగ్ నుంచి రిటైరయ్యాడు మహమ్మద్ ఆలీ. ఫోర్ మాన్ 1977లో బాక్సింగ్ నుంచి రిటైరయ్యి చర్చి మినిస్టర్ అయ్యాడు.

జైరేలో ఫైట్ తరువాత ఆలీ, ఫోర్ మాన్ ఇద్దరూ మంచి మిత్రులు అయ్యారు. ఈ ఫైట్ గురించి చిత్రీకరించిన డాక్యుమెంటరీ “వెన్ వియ్ వర్ ది కింగ్స్” 1996లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నప్పుడు, దాన్ని అందుకోవడానికి అప్పటికే పార్కిన్ సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆలీని వేదిక మీదకు ఫోర్ మాన్ నడిపించుకొని పోయాడు. ఆ వ్యాధి వల్లనే మహమ్మద్ అలీ 2016లో మరణించాడు.

Also Read : క్రికెట్ గతినే మార్చిన ఆ ప్రపంచ కప్ ..

Show comments