1986 బెంగ‌ళూరు గ్యాంగ్ వార్‌

1980, మొద‌టిసారి బెంగ‌ళూరు చూశాను. రాయ‌దుర్గం నుంచి అనంత‌పురం 1976లో వ‌చ్చిన‌ప్పుడు నా దృష్టిలో అదో న‌గ‌రం. చాలా పెద్ద ఊరు. బెంగ‌ళూరు చూసిన‌ప్పుడు క‌ళ్లు చెదిరాయి. అనంత‌పురం నుంచి రెండే బ‌స్సులు. SN అనే బ‌స్సు ఉద‌యాన్నే ఎక్కితే ఆరు గంట‌ల సేపు ప్ర‌యాణం చేసేది. ఇప్పుడు న‌గ‌రంలో క‌లిసిపోయిన ఎలహంక‌, హెబ్బాల్ అప్ప‌ట్లో చిన్న గ్రామాలు. ఇవ‌న్నీ దాటుకుని మెజిస్టిక్ చేరే స‌రికి క‌ళ్ల ముందు అద్భుత న‌గ‌రం. నేను చూసిన మొద‌టి సిటీ అది. కేవ‌లం హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూడ్డానికి నేనూ, ఇంకో మిత్రుడు వ‌చ్చాం. శార‌దా హోట‌ల్‌లో రూమ్ రెంట్ 15 రూపాయ‌లు. కామ‌త్‌లో భోజ‌నం. మెజిస్టిక్ చుట్టూ థియేట‌ర్లే.

తిరిగి వెళ్ల‌డానికి క‌ళాస‌పాళ్యెం బ‌స్టాండ్‌కు వెళ్లాలి. అనంత‌పురం బ‌స్సులు అక్క‌డే వుంటాయి. అది అతిపెద్ద ప్రైవేట్ బ‌స్టాండ్‌. ఫ‌స్ట్ టైమ్ కొత్యాల్ రామ‌చంద్ర అనే పేరు అక్క‌డ విన్నాను. అత‌నో పెద్ద రౌడీ. బెంగ‌ళూరును వ‌ణికిస్తాడు. బ‌స్టాండ్ అంతా అత‌ని మ‌నుషులే. జేబు కొట్టేసినా అర‌వ‌కుండా మూసుకుని వెళ్లాలి. ఇది నా మిత్రుడు చెప్పిన హిత‌వు.

త‌ర్వాత అత‌ని గురించి చాలా క‌థ‌లు విన్నాను. బెంగ‌ళూరికి త‌ర‌చుగా వెళ్ల‌డం వ‌ల్ల ప్ర‌తిసారి కొత్త క‌థ వినిపించేది. గ‌వ‌ర్న‌మెంట్‌నే భ‌య‌పెట్టే కెపాసిటీ ఉన్న రౌడీ రామ‌చంద్రా అని సారాంశం. 1986లో అత‌ని మ‌ర్డ‌ర్ జ‌రిగింద‌ని తెలుసు. కానీ ఎలా జ‌రిగిందో తెలియ‌దు. దానికి సమాధానం గ్యాంగ్స్ ఆఫ్ బెంగ‌ళూరు పుస్త‌కంలో దొరికింది.

అగ్ని శ్రీ‌ధ‌ర్ ఆత్మ‌క‌థ ఇది. రామ‌చంద్ర‌ను చంపిన‌ వాళ్ల‌లో ఆయ‌నొక‌రు. 443 పేజీల పుస్త‌కాన్ని ఆప‌కుండా చ‌దివేశాను. ఈ మ‌ధ్య కాలంలో ఇంత వేగంగా చ‌దివిన పుస్త‌కం ఇదేనేమో! లా చ‌దువుతున్న శ్రీ‌ధ‌ర్ , ఒక రౌడీగా మారి చివ‌రికి హ‌త్య వ‌ర‌కూ ఎలా వ‌చ్చాడ‌నేది క‌థ‌. దీనికి క‌ర్నాట‌క సాహిత్య అకాడ‌మీ బ‌హుమ‌తి ల‌భించింది. సృజ‌న్ అనువాదం చేశారు. చాలా సులువుగా , అర్థ‌వంతంగా అనువాదం చేశారు.

క‌న్న‌డ భాష ప‌రిమ‌ళం అక్క‌డ‌క్క‌డ అదే ప‌దాల రూపంలో త‌గులుతూ నేటివిటీని వ్య‌క్తం చేస్తూ వుంటుంది. ఈ బుక్‌లో అనేక మంది రౌడీలు వ‌స్తూ వుంటారు. ఎక్క‌డా సెంటిమెంట్‌, ఎమోష‌న్స్ క‌న‌ప‌డ‌వు. రౌడీల దాడులు, ఎత్తుగ‌డ‌లే వుంటాయి. రాజ‌కీయ నాయ‌కుల‌కీ, రౌడీల‌కీ ఉన్న సంబంధాలు కూడా అర్థ‌మ‌వుతాయి. ఒక‌ప్పుడు నాయ‌కుల ద‌గ్గ‌ర రౌడీలుండేవారు. ఇప్పుడు రౌడీలే నాయ‌కులై పోయారు.

ఈ పుస్త‌కంలో క‌నిపించే ప్ర‌తిపాత్ర నాకు వేరే విధంగా తెలుసు. అంటే ఆ రోజుల్లో ప్ర‌తి ఊళ్లో ఈ ర‌కం రౌడీలుండేవారు. అనంత‌పురంలో ప‌హిల్వాన్ సూరి, గూండా గోపాల్ వుండేవాళ్లు. గోపాల్ నా క్లాస్‌మేట్‌. ఇత‌ను స్కూల్ మానేసి గూండాగా ఎదిగాడు. సూరీ నీలం టాకీస్ ఏరియాకి డాన్‌. ఇద్ద‌రి మ‌ధ్య వైరం న‌డిచింది. సూరీ లాక‌ప్ డెత్‌గా మారితే, గోపాల్ ప్ర‌త్య‌ర్థుల చేతిలో పోయాడు. అగ్ని శ్రీ‌ధ‌ర్ ఇంత‌కాలం బ‌తికి ఈ పుస్త‌కం రాయ‌డ‌మే గొప్ప‌. జ‌ర్న‌లిస్టు ఉద్యోగంలో ఎంద‌రో రౌడీలు కౌన్సిల‌ర్లు, లోక‌ల్ లీడ‌ర్ల‌గా ఎద‌గ‌డం చూశాను. చిత్తూరులో త‌నిఖాచ‌లం అనే రౌడీ ఎలా చ‌నిపోయాడో అంద‌రికీ తెలుసు. తిరుప‌తి ప్ర‌త్యేక‌త ఏమంటే దేవుడి చుట్టూ మాఫియా వుంటుంది.

మాఫియా అంటే అది సినిమాల్లోనో, పుస్త‌కాల్లోనో వుండ‌దు. మ‌న చుట్టూ వైఫైలా వుంటుంది. ఒక్కోసారి మ‌న ప‌క్కింట్లో కూడా వుండొచ్చు. మ‌నం ఏదో ఉద్యోగ‌మో చేసుకుంటూ జీవిస్తూ వుంటే క‌న‌ప‌డ‌దు. ఒక వ్యాపారం చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌పుడు ఆ బిజినెస్‌లో వున్న మాఫియా ముందుకొస్తుంది.

ఒక హోట‌ల్ పెడితే వ‌చ్చి డ‌బ్బుల‌డుగుతుంది. ఇవ్వ‌క‌పోతే సాంబారులో బొద్దింక క‌న‌ప‌డుతుంది. అల్ల‌ర‌వుతుంది. పోలీసులుం టారు. వెళ్లే ధైర్యం మ‌న‌కుండ‌దు. ఓల్డ్ సిటీలో షూటింగ్ చేయాలంటే అక్కడి ప‌హిల్వాన్ల‌ని ప్ర‌స‌న్నం చేసుకోవాల్సిందే.

ఈ పుస్త‌కంలోని అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌న‌ల్ని భ‌య‌పెడుతుంది. నిజంగా ఇట్లా జ‌రుగుతాయా? అనిపిస్తుంది. పైకి క‌నిపించే నాగ‌రిక ప్ర‌పంచం కింద ఈ అనాగ‌రిక హింసా ప్ర‌పంచం వుంది. అందుకే దాన్ని అండ‌ర్ వ‌ర‌ల్డ్ అంటారు.

పుస్త‌కాలు ప‌బ్లిష్ చేయ‌డం రిస్క్ అనుకునే కాలంలో అన్సిక్షికి ప‌బ్లిష‌ర్స్ తెలుగు పాఠ‌కుల‌కి చేస్తున్న సేవ గొప్ప‌ది. చ‌ద‌వ‌డం స్టార్ట్ చేస్తే క్రైం సీరిస్ చూసిన‌ట్టు వుంటుంది. పుస్త‌కం కావాలంటే అన్ని బుక్‌స్టాల్స్‌లో వుంటుంది.

Show comments