ఫోర్జరీ సంతకాలతో నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి అనుమతి లేకుండా అక్రంగా వాహనాలు విక్రయించిన కేసులో జెసి ట్రావెల్స్ పై దాడి చేసిన అధికారులు ఆ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులను అరెస్ట్ చేసి 24 గంటలు కూడా గడవకముందే తాజాగ మాజీ మంత్రికి చెందిన జెసి ట్రావెల్స్ లో మరో జాతీయస్థాయి కుంభకోణం వెలుగు చూసింది.
మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి కి చెందిన జెసి ట్రావెల్స్ సంస్థ నిబంధనలను తుంగలోకి తొక్కి 68 బిఎస్ స్టేజ్-III లారీలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి వాటికి అక్రమ ధ్రువ పత్రాలు సృష్టించి బిఎస్ స్టేజ్-IV గా మార్చి, వాటిని నాగాలాండ్ రిజిస్ట్రేషన్ తో విక్రయించిన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. ఆవిధంగా విక్రయించిన వాహనాల్లో కొన్నింటిని జెసి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి పేరు మీద, మరికొన్ని వాహానాలను జెసి ప్రభాకర్ రెడ్డి భార్య ఉమాదేవి పేరిట రిజిస్ట్రేషన్ చేశారని అధికారులు గుర్తించారు. జెసి ట్రావెల్స్ భాగోతంపై రవాణాశాఖ అధికారులు అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వాస్తవంగా పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న బిఎస్ స్టేజ్-III వాహనాలను సుప్రీం కోర్ట్ 2017 ఏప్రిల్ 17 నుండి నిషేదించింది. రవాణా శాఖ మరియు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిఎస్ స్టేజ్-III వాహనాలను రోడ్లమీద తిరగకుండా నిషేదించారు. దాని ప్రకారం 2017 ఏప్రిల్ 1 తరువాత బిఎస్ స్టేజ్-III వాహనాల రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు.
దీనితో ఇదే అదునుగా కొంతమంది వ్యక్తులు ప్రముఖ వాహాన తయారీ సంస్థ అశోకా లై ల్యాండ్ కంపెనీ దగ్గర అప్పటికే తయారయిన బిఎస్ స్టేజ్-III వాహనాలను తక్కువధరకు స్క్రాప్ కింద కొనుగోలు చేసి వాటికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వాటిని బిఎస్ స్టేజ్-IV వాహనాలుగా మార్చారు. అలా మార్చిన వాహనాలను నాగాలాండ్ లో రిజిస్టర్ చేయించి వాటిని ఆంధ్రప్రదేశ్ లో విక్రయించడం జరిగింది. దీనిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి నాగాలాండ్, అశోకా లై ల్యాండ్ కంపెనీల దగ్గరికి వెళ్లి విచారించగా, తీగ లాకితే డొంకంతా కదిలింది. అధికారుల విచారణలో చవ్వ గోపాల్ రెడ్డి, జఠాధర ఇండస్ట్రీస్ పేరుమీద రాష్ట్రంలో విక్రయించినట్టు వెలుగు చూసింది. ఈ రెండు కంపెనీలు చవ్వ గోపాల్ రెడ్డి, జెసి ఉమాదేవి పేరు మీద వున్నాయి.
దీనితో రవాణా శాఖా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోటార్ వాహనంలోని సెక్షన్ 189, 190 ల ప్రకారం నిభందనలు ఉల్లంఘించిన వ్యక్తులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.